
ఘటప్రభలో విదేశీ పక్షుల సందడి
బనశంకరి: ప్రకృతి రమణీయత, వేలాది జాతులు జంతు, వృక్ష, పక్షి సంపదకు కర్ణాటక నిలయం. రాష్ట్రంలో దాదాపు 15 వరకు అభయారణ్యాలు, పక్షులు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. రంగనతిట్టు పక్షులు సంరక్షణ కేంద్రం శ్రీరంగపట్టణానికి 4 కిలోమీటర్లు దూరంలో మైసూరుకు 19 కిలోమీటర్లు దూరంలో ఉంది. కావేరినదిలో పరివాహక ప్రాంతం 40 ఎకరాల విస్తీర్ణంలో చూడటానికి ద్వీపం లాగా కనిపిస్తుంది. సైబీరియా, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన వివిధ జాతులు పక్షులు ఇక్కడకు సంతానోత్పత్తికోసం వలసలు వస్తుంటాయి. డిసెంబరు నుంచి ఆగస్టులో ఈ పక్షి సంరక్షణ కేంద్రానికి వీక్షించడానికి అనువైన సమయం.
అత్తివేరి
రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో ముద్గాడ్ తాలూకా అత్తివేరి పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. హుబ్లీ పట్టణానికి 43 కిలోమీటర్లు దూరంలో 2.23 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో కలదు. ఏడాదిలో ఏ సమయంలోనైనా అత్తివేరి పక్షి సంరక్షణ కేంద్రాన్ని మనం చూడటానికి బాగుంటుంది. ఈ పక్షి సంరక్షణ కేంద్రానికి దగ్గరలో అత్తివేరి రిజర్వాయరు కలదు.
బంకాపుర
హవేరి జిల్లాలోని బంకాపుర అటవీ ప్రాంతంలో ఈ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. రాష్ట్రంలో రెండు నెమలి సంరక్షణ కేంద్రాల్లో ఇది ఒకటి. దీనిని నెమలి సంరక్షణ కేంద్రంగా 2006 జూన్ 9న ప్రకటించింది. ఇది 139 ఎకరాల్లో విస్తరించింది. దాదాపు రెండువేల నెమళ్లను మనం ఇక్కడ చూడవచ్చు. కేవలం నెమళ్లు కాకుండా ఇండియన్ రాబిన్, కింగ్‌ఫిషర్ తదితర పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
బోనాల్ బర్డ్
యాదగిరి జిల్లాలోని సోరాపుర తాలూకాలో బోనాల్ అనే గ్రామం వద్ద ఈ పక్షి సంరక్షణ కేంద్రం కలదు. రాష్ట్రంలో అతి విస్తీర్ణమైన పక్షి సంరక్షణ కేంద్రాల్లో రంగనతిట్టు తర్వాత బోనాల్ రెండోస్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ పక్షి సంరక్షణ కేంద్రానికి వెళితే దాదాపు 21 జాతుల పక్షులను ఒకచోట మనం చూడవచ్చు.
ఘటప్రభ
బెళగావి జిల్లా గోకాక్ తాలూకాలో ఘటప్రభ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. 29.78 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగిన ఈ పక్షి సంరక్షణ కేంద్రంలో వేల పక్షులను ఒకేచోట చూడవచ్చు. నవంబరు నుంచి మార్చి మధ్య కాలంలో ఇక్కడకు ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తారు. ఇక్కడికి వెళ్తే ఘటప్రభ నదీజలాలు అందాలను కూడా వీక్షించడానికి వీలవుతుంది.
గుడవి పక్షిధామం
శివమొగ్గ జిల్లా సొరబ తాలూకా గుడవి పక్షిధామ కేంద్రంలో 217 జాతులు పక్షులు కలవు. సొరబ పట్టణానికి 16 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. 0.74 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం మేర విస్తరించింది. 217 జాతులకు చెందిన పక్షులను ఇక్కడ మనం గమనించవచ్చు. గుడవి సరస్సు ఒడ్డున ఉన్న పక్షికేంద్రం వీక్షించడానికి వర్షాకాలం అనువైంది.
మాగడి
గదగ జిల్లా శిరహట్టి తాలూకాలోని మాగడి గ్రామసమీపంలో ఈ పక్షి సంరక్షణ కేంద్రం కలదు. గదగ్‌కు 26 కిలోమీటర్లు దూరంలో ఉన్న పక్షి కేంద్రాన్ని చలికాలంలో చూడటానికి అనుకూలంగా ఉంటుంది.
దండేలి
ఉత్తర కన్నడ జిల్లాలో 834.16 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించిన అభయారణ్యాల్లో ఇది మొదటి వరుసలో ఉంటుంది. ఈ అభయారణ్యం ఎన్నో రంగుల పక్షులకు నిలయం. నవంబరు నుంచి జనవరి మధ్య ఈ పక్షి సంరక్షణ కేంద్రాన్ని చూడటానికి ఎక్కువ మంది పర్యాటకులు తరలివస్తారు.
ఆదిచుంచనగరి
సముద్రమట్టానికి దాదాపు 700 మీటర్లు ఎత్తులో ఉన్న ఈ పక్షి సంరక్షణ కేంద్రం కర్ణాటకలోని మండ్య జిల్లాలో రెండో నెమలి సంరక్షణ కేంద్రం. ఇక్కడ వివిధ రకాల జాతులకు చెందిన సీతాకోక చిలుకలను కూడా మనం చూడవచ్చు.
పక్షి సంపదకు నిలయం కర్ణాటక
రంగనతిట్టు పక్షిధామ కేంద్రంలో వివిధ రకాల పక్షుల విహారం
ఖండాతరాలు దాటుకుని సంతానోత్పత్తి కోసం రాక
రామనగర
రాబందుల సంరక్షణ కేంద్రం ఇదొక్కటే బెంగళూరుకు దగ్గరగా రామదేవర బెట్టలో ఈ పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. కర్ణాటక ప్రభుత్వం 2012 జనవరి 30 దీనిని అధికారికంగా రాబందుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది.

ఓ కొలను వద్ద సేద తీరుతున్న నల్ల కొంగలు

పక్షిధామంలో గూళ్లపై పక్షులు