
రక్తం పంచుకు పుట్టిన తనయులతో పాటు తల్లి కూడా ప్రాణాలు విడిచి పేగుబంధాన్ని చిహ్నంగా నిలిచింది.
కర్ణాటక: రక్తం పంచుకు పుట్టిన తనయులతో పాటు తల్లి కూడా ప్రాణాలు విడిచి పేగుబంధాన్ని చిహ్నంగా నిలిచింది. బైకును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొని ఈడ్చుకెళ్లిన దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘోరం తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకాలోని అరసాపురర గేట్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. మృతులు మధుగిరి తాలూకాలోని వీరెనహళ్ళి తాండాకు చెందిన అన్నదమ్ములు పవన్ (20), బాలాజీ (18), వారి తల్లి అనితాబాయి (40).
బైక్‌పై వేరే ఊరికి వెళ్తుండగా
వివరాలు.. బంధువులను కలవాలని తల్లిని తీసుకుని బైక్‌పై గౌరిబిదనూరుకు బయల్దేరారు. 25 కిలోమీటర్లు ప్రయాణించారో లేదో.. అరసాపుర గేట్ వద్ద ఎదురుగా లారీ వేగంగా వస్తూ వీరిని ఢీకొని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. బాధితులు తీవ్ర గాయలతో ప్రాణాలు కోల్పోయారు. వెంటనే డ్రైవర్ లారీని వదిలి పారిపోయాడు. కొరటిగెరె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను కొరటిగెరె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో కొన్ని గంటల పాటు అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై రక్తపాతాన్ని చూసి అందరూ చలించిపోయారు.