
బెంగళూరు యశవంతపుర పై వంతెన వద్ద వర్షంలో వాహనాల రద్దీ
యశవంతపుర: బంద్ కంటే ముందుగానే రాజధానికి బంద్ వాతావరణం వచ్చింది. గురువారం నుంచి వరుస సెలవులు కావడంతో సిలికాన్ నగరం సగం ఖాళీ అయ్యింది. సొంతూళ్లకు వెళ్లేవారితో బుధవారం సాయంత్రం నుంచి నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గురువారం ఈద్ మిలాద్, శుక్రవారం కావేరి బంద్, శని, ఆదివారం వీకెండ్, సోమవారం గాంధీ జయంతి సెలవు కావడంతో చాలామంది సొంతూర్లకు, విహారయాత్రలకు బయలుదేరారు. కార్లు, క్యాబ్‌లతో రోడ్లు నిండిపోయాయి. సాయంత్రం 3:30 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌తో వాహనాలు నిలిచిపోయాయి. చాలామంది ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నగర రింగ్ రోడ్డులో రద్దీ మిన్నంటింది.
3 గంటలకు 1.5 కి.మీ ప్రయాణం
వాహనదారులు రద్దీని తప్పించుకోవడానికి మారతహళ్లి, సర్జాపుర, సిల్క్‌బోర్డు మార్గంలో వెళ్లారు. కారు, బస్సు మూడు గంటలు ప్రయత్నిస్తే 1.5 కిలోమీటర్లు దూరం మాత్రం ముందుకెళ్లాయి. అంతగా వాహనాలు కిక్కిరిసిపోయాయి. అనేక స్కూల్ వాహనాలు రాత్రి 8 గంటలకు విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లాయి. ట్రాఫిక్‌లో చిక్కుకున్నవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆక్రోశం వ్యక్తం చేస్తూ వీడియోలను పోస్టు చేశారు. బెళ్లందూరు రోడ్డులో ట్రాఫిక్ కారణంగా పాదచారులకు కూడా జాగా దొరకలేదు. ఫుత్‌పాత్‌లకు ఇరువైపులా బైకుదారులు నిలిచిపోయారు. బంద్, సెలవుల వల్ల భారత పర్యటనలో ఉన్న హాస్యనటుడు ట్రెవర్ నోహా బెంగళూరులో నిర్ణయించిన ప్రదర్శనను రద్దు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ట్రెవర్ నోహ్ కూడ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.
వరుస సెలవులతో బెంగళూరు సగం ఖాళీ
బుధవారం సాయంత్రం నుంచే
ప్రయాణాలు
రహదార్లలో తీవ్రమైన ట్రాఫిక్ జాం