
మాట్లాడుతున్న ఆరోగ్య విద్యాధికారి శివప్ప
రాయచూరు రూరల్: నగరంలో తొమ్మిదో రోజున వినాయక నిమజ్జనాలు వైభవంగా జరిగాయి. బుధవారం రాత్రి పది గంటల నుంచి ప్రారంభమైన వినాయకుల ఊరేగింపు గురువారం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. తీన్‌కందీల్ నుంచి సూపర్ మార్కెట్, మహావీర్ చౌక్, మహాబళేశ్వర చౌక్, షరాఫ్ బజారు, పేట్లా బురుజు మీదుగా ఖాస్‌బావి వరకు డీజే శబ్దంతో నృత్యం చేస్తూ వందకు పైగా గణనాథులను నిమజ్జనం చేశారు.
గంజాయి సాగు రైతు అరెస్ట్
సాక్షి బళ్లారి: చిత్రదుర్గ జిల్లా మొళకాల్మూరు తాలూకాలో గంజాయిని పెంచుతున్న ఓ రైతును పోలీసులు అరెస్ట్ చేశారు. మొళకాల్మూరు తాలూకా రాయాపుర గ్రామానికి చెందిన భైరయ్య అనే రైతు తన పొలంలో గంజాయిని పెంచుతున్నారని తెలుసుకొని పోలీసులు దాడి చేసి 90 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ఎకై ్సజ్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
దోమల కట్టడితోనే
డెంగీ దూరం
కంప్లి: దోమలను నియంత్రించినప్పుడే డెంగీని అరికట్టగలం, లేని పక్షంలో వివిధ వ్యాధులను అరికట్టడం కష్టసాధ్యమని క్షేత్ర ఆరోగ్య విద్యాధికారి శివప్ప తెలిపారు. వడ్డు గ్రామంలో గుంపు సభ ద్వారా డెంగీ, చికన్‌గున్యా వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన జాగృతి కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఆదాయానికి మించి ఆర్జన కేసులో అధికారికి జైలు శిక్ష
హుబ్లీ: ఆదాయానికి మించి సంపాదన కలిగిన ఆరోపణలను ఎదుర్కొన్న బెళగావి జిల్లా కిత్తూరు తాలూకా కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ నూర్ అహ్మద్‌ఖాన్‌కు ధార్వాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ ప్రత్యేక కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధించింది. 2010 నవంబర్ 15న నూర్ అహ్మద్ ఖాన్ నివాసంపై దాడి చేసిన ధార్వాడ లోకాయుక్త పోలీసులు కేసును దర్యాప్తు జరిపి కోర్టుకు చార్జ్‌షీట్ సమర్పించారు. సదరు కోర్టు న్యాయమూర్తి ఎన్.సుబ్రమణ్య కేసు విచారణ చేపట్టి నూర్ అహ్మద్‌ఖాన్‌కు ఏడాది కఠిన కారాగార వాసంతో పాటు రూ.25 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
చివరి ఆయకట్టుకు నీరందించాలి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ చివరి ఆయకట్టుకు నీరు అందించాలని తుంగభద్ర ఎడమ కాలువ పోరాట సమితి నేతలు డిమాండ్ చేశారు. బుధవారం మాన్వి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అధ్యక్షుడు శంకర్‌గౌడ మాట్లాడారు. ఈ విషయంలో ఇంజినీర్లు సక్రమంగా కాలువలపై నీటి నిర్వహణ చేసి చివరి ఆయకట్టుకు నీరందించాలని ఒత్తిడి చేశారు.
జిల్లాలో నేటి బంద్‌కు
మీదే బాధ్యత
బళ్లారిఅర్బన్: కావేరి నీటి నిర్వహణ ప్రాధికారకు వ్యతిరేకంగా శుక్రవారం చేపట్టే కర్ణాటక బంద్, నిరసనలు చట్ట, రాజ్యాంగ విరుద్ధమైనందున బంద్‌కు నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని జిల్లా ఎస్పీ రంజిత్‌కుమార్ బండారు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కన్నడ అనుకూల సంఘాలు, రైతు, దళిత సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు, వ్యాపారులు, ఇతర సంస్థలు కలిసి కర్ణాటక బంద్‌కు పిలుపునివ్వడం కోర్టు తీర్పు ప్రకారం రాజ్యాంగం విరుద్ధం అని, అందుకు జిల్లాలో ఎలాంటి బంద్, నిరసనలు, ఊరేగింపులతో ప్రజల ఆస్తులకు నష్టం, ప్రాణనష్టం, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే నేరుగా మీరే బాధ్యత వహిస్తారని తెలిపారు.
వైద్యుడిని బదిలీ చేయండి
కంప్లి: కానాహొసళ్లిలోని పీహెచ్‌సీలో ఆశా కార్యకర్తపై వైద్యాధికారి దుర్భాషలాడారని ఆరోపిస్తూ ఆస్పత్రి ఆవరణలో ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కాన్పు కోసం గర్భిణులను ఆశా కార్యకర్తలు ఆస్పత్రికి పిలుచుకొని రాగా డాక్టర్ విశ్వనాథ్ చికిత్స అందించేందుకు రాలేదు. పైగా ఆశా కార్యకర్తలు చెప్పే ఏ విషయానికి స్పందించకపోగా నిర్లక్ష్యం చేశారని, ఇలాంటి నిర్లక్ష్య ధోరణిని చూపే వైద్యుడిని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

ఊరేగింపుగా తరలుతున్న వినాయక ప్రతిమలు

అధికారికి విన్నవిస్తున్న ఆశా కార్యకర్తలు