హుబ్లీ: నగరంలో బుధవారం జరిగిన యువకుడి దారుణ హత్య కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టపగలే మారణాయుధాలతో సిల్వర్‌టౌన్‌లో మౌలాలి అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దీని పర్యవసానంగా జరిగిన పరిణామాల్లో హత్య చేసిన నిందితుడు పరుశప్ప(50) ఇక్కడి అన్నపూర్ణ నగర్ మెయిన్ రోడ్డులో ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడిని హత్య చేసిన ఆరోపణలపై పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోక ముందే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా పరుశప్ప నిర్మాణ దశలోని కట్టడంలో వాచ్‌మ్యాన్‌గా పని చేసేవాడు. ఇతని సొంత ఊరు గదగ్ జిల్లా లక్ష్మేశ్వర. పరుశప్ప కుటుంబంతో పాటు నిర్మాణ దశలో ఉన్న కట్టడంలో నివసించే వాడు. పరుశప్ప వివాహిత కుమార్తెతో హతుడైన మౌలాలి వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడని ఆగ్రహించిన పరుశప్ప యువకుడు మౌలాలిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హతుడు మౌలాలి ఉత్తర కన్నడ జిల్లా ముండగోడ తాలూకా మరగడి నివాసి. కట్టడ నిర్మాణ కూలీగా హుబ్లీకి వచ్చాడు. ఘటన స్థలాన్ని గోకుల్‌రోడ్డు పోలీసులు పరిశీలించి పరుశప్ప ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.