
టేబుల్ మీద క్యాట్ స్నేక్
మైసూరు: చిన్న విషయానికి విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒకరు మృతి చెందిన ఘటన మైసూరు నగరంలోని జేపీ నగరలో కళాశాల వద్ద జరిగింది. మహాదేవపురకు చెందిన సతీష్ కుమారుడు కృష్ణ (17) హతుడు. వివరాలు.. కృష్ణ పీయూసీ చదువుతున్నాడు. కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్‌లో సహచర విద్యార్థితో గొడవ జరిగింది, కళాశాల ముగిసిన తరువాత బయటకి వచ్చి ఘర్షణపడి తీవ్రంగా కొట్టుకున్నారు. కృష్ణకు గొంతు భాగంలో బలంగా తగలడంతో ఊపిరి ఆడక కింద పడిపోయాడు. స్థానికులు చూసి అతన్ని ఆస్పత్రికి తరలించగా కొంతసేపటికి మరణించాడు. నిందిత విద్యార్థిని విద్యారణ్యపుర పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
వేటకొడవళ్లతో చిందులు,
ఇద్దరిపై కేసు
శివమొగ్గ: శివమొగ్గ జిల్లా హోళెహోన్నూరు సమీపంలోని ఆరికెరె గ్రామంలో గణపతి నిమజ్జనం ఊరేగింపులో ఇద్దరు యువకులు వేటకొడవళ్లు పట్టుకుని డ్యాన్స్‌లు చేస్తూ హల్‌చల్ చేశారు. రెండు రోజుల క్రితం గణేశ నిమజ్జనం ముందు ఇద్దరు యువకులు కొడవళ్లు పట్టుకుని చిందులేశారు. ఈ దృశ్యాలు కొందరు సెల్‌ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విచారణ చేసిన పోలీసులు ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి హెచ్చరించి పంపివేశారు.
వాటర్ సంపు కూలి
బాలుడి దుర్మరణం ●
● వసతి పాఠశాలలో ఘోరం
దొడ్డబళ్లాపురం: వసతి పాఠశాలలో వాటర్ సంపు కూలి బాలుడు మృతి చెందిన సంఘటన రామనగర తాలూకా హెచ్.గొల్లహళ్లి గ్రామంలోని మొరార్జీదేశాయి వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఇదే పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కౌశిక్ గౌడ (12)మృతి చెందిన బాలుడు. గురువారం ఉదయం ముఖం కడుక్కోడానికి వెళ్లిన సమయంలో వాటర్ సంపు కూలింది. ఇటీవలే సంపు నిర్మించారని, నాణ్యత లోపంతో ఇది కూలినట్టు తెలుస్తోంది. వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బిడది పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
డీఎస్పీగా చంద్రశేఖర్
తుమకూరు: తుమకూరు ఉప విభాగం నూతన డీఎస్పీగా చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉప విభాగం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన తుమకూరు సీఐగా కూడా పనిచేశారు. శాంతిభద్రతల పరిరక్షణే ముఖ్యమని ఈ సందర్భంగా నూతన డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు.
అరుదైన క్యాట్ స్నేక్ లభ్యం
యశవంతపుర: అరుదైన పాము దక్షిణకన్నడ జిల్లా పుత్తూరు బల్నాడ్‌కు చెందిన రవికృష్ణ కల్లజె ఇంట్లో కనిపించింది. వంటగదిలో టేబుల్‌పై పాము ఉండగా చూసి భయపడ్డారు. పాముల నిపుణుడు తేజస్ బన్నూరుకు పిలిపించగా దానిని చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలారు. పొడవైన ఈ పామును ఫాస్టెన్ క్యాట్ స్నేక్‌గా పిలుస్తారు. ఇటువంటి సర్పాన్ని ఎప్పుడూ చూడలేదని తేజస్ చెప్పాడు. కాగా, ఈ పాములు దక్షిణాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలో అరుదుగా కనిపిస్తాయి. వీటి నేత్రాలు పిల్లి కళ్ల మాదిరిగా ఉండడంతో ఆ పేరు వచ్చింది. ఇండియన్ గమ్మా స్నేక్ అని కూడా అంటారు. ఇవి తేలికపాటి విషాన్ని కలిగి ఉంటాయి.

చేతిలో కొడవలి


హతుడు కృష్ణ (ఫైల్)