
గురువారం మైసూరులో నీరావరి ఆఫీసును ముట్టడించిన రైతులు
మైసూరు: తమిళనాడుకు కావేరి నీటిని వదలరాదని వందలాది మంది రైతులు గురువారం మైసూరు నగరంలోని కావేరి నీటిపారుదల కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ముట్టడించి ధర్నా చేశారు. పోలీసులు అడ్డుకున్నా కూడా రైతులు తరలివచ్చారు. కొంతసేపు పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులను తోసుకొని వెళ్లి బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చీపుర్లతో ప్రదర్శన
రాష్ట్రంలో సరిగా వర్షాలు పడక జలాశయాల్లో నీరు లేదు, అయినా నీరు వదిలేయడం సబబు కాదని కర్ణాటక సేనా, అఖిల కర్ణాటక ఒక్కలిగ సంఘం ఆధ్వర్యంలో చీపుర్లతో ప్రదర్శన చేశారు. మైసూరు జడ్పీ ఆఫీసు వద్దకు చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విధానసౌధ ముట్టడికి యత్నం
శివాజీనగర: తమిళనాడుకు నీటిని వదలాలన్న ఆదేశాలపై బెంగళూరు, దావణగెరోలనూ జోరుగా ఆందోళనలు జరిగాయి. బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు టీ.ఏ.నారాయణగౌడ నేతృత్వంలో వందలాది మంది కరవే కార్యకర్తలు విధానసౌధ ముట్టడికి ఊరేగింపుగా వచ్చారు. మౌర్య సర్కిల్ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకొని నిర్బంధించారు. కర్ణాటక రైతులకు మరణ శాసనమైన ఈ ఆదేశాన్ని రద్దు చేయాలి. ప్రజల తాగునీటి హక్కుల్ని కాపాడాలని నినాదాలు చేశారు. దావణగెరెలో రైతులు పెద్దసంఖ్యలో హైవేని దిగ్బంధించారు. కన్నడ, ప్రజా సంఘాలు బెంగళూరు–మైసూరు రహదారిలో అనేకచోట్ల రస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు.
సందర్భం చూసి పోరాటం
నటుడు రాఘవేంద్ర రాజకుమార్ మాట్లాడుతూ తన తండ్రి కాలం నుంచి కావేరి విషయంలో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. సందర్భం వచ్చిన్నప్పుడు ప్రజలే తమను పిలుపిస్తారని, ఈ అంశం కోర్టులో ఉన్నందున సంయమనంతో ఉండాలని అన్నారు.
మైసూరు, మండ్య, బెంగళూరులో ఆందోళనలు
సర్కారు విఫలం: బీజేపీ
యశవంతపుర: కావేరి నీటిని తమిళనాడుకు వదలటం వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందని బీజేపీ మాజీ మంత్రి ఆర్.అశోక్ ఆరోపించారు. కావేరి వ్యవహారంలో పరిస్థితి చేయిదాటి పోయిందని, దీనికి సర్కారే కారణమన్నారు. నీటిని వదిలితే అడ్డుకుంటామన్నారు. సోనియాగాంధీ సంతృప్తి కోసం తమిళనాడుకు నీరు వదులుతున్నారని మాజీ సీఎం బసవరాజ బొమ్మై ఆరోపించారు. సుప్రీంకోర్టులో వాదనలు చేయలేక చేతులెత్తేసిందన్నారు.

బెంగళూరు మౌర్య కూడలిలో నిరసనకారుల నిర్బంధం