
కావేరి జలాల ఆందోళనలు కొత్త ప్రాంతాలకు విస్తరించాయి. గురువారం దావణగెరెలో రైతుల ధర్నా
శివాజీనగర: 15 రోజుల పాటు తమిళనాడుకు నిత్యం 5 వేల క్యూసెక్కుల నీటిని వదలాలనే కావేరి నీటి నిర్వహణ ప్రాధికార (సీడబ్ల్యూఎంఏ) ఆదేశాలను నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇందులో జోక్యం చేసుకోబోమని, ప్రాధికార ఆదేశాలను పాటించాలని కోర్టు స్పష్టం చేయడంతో సిద్దరామయ్య ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంతీర్పు రాగానే కన్నడనాట కావేరి బెల్ట్‌లో నిరసనలు మిన్నంటాయి.
రాష్ట్రంలో కరువు తిష్ట
కొన్నివారాలుగా తమిళనాడుకు రోజూ 5 వేల క్యూసెక్కుల నీటిని కావేరి జలాశయాల నుంచి విడుదల చేయడం తెలిసిందే. ఈ ఏడాది సరైన వానలు లేనందున కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. సుమారు 200 తాలూకాలలో దుర్భిక్షం ఏర్పడిందని సీఎం సిద్దరామయ్య అనేకసార్లు ప్రకటించారు. కావేరి నదిపై అతి పెద్దదైన మండ్య కేఆర్‌ఎస్ జలాశయం ద్వారా నీటిని వదులుతుండగా, ఆ ప్రాంత రైతులు నిత్యం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు బుధవారం ఢిల్లీలో సమావేశమై, సుప్రీంను, కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని తీర్మానించడం తెలిసిందే.
అయినా చుక్కెదురు
కరువు నేపథ్యంలో నీటిని విడుదల చేయలేమని, స్టే ఇవ్వాలని రిట్ పిటిషన్ దాఖలు చేయగా అది ఫలించలేదు. అలాగే తమ వాదన వినాలనే రైతుల పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం స్వీకరించలేదు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, ప్రశాంత్‌కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మపీఠం ఈ రిట్‌ను విచారించింది. అనావృష్టి వల్ల కావేరి డ్యాముల్లో నీటిమట్టం అంతంతమాత్రంగా ఉంది, ప్రజాగ్రహం కూడా తీవ్రంగా ఉంది, ఈ నేపథ్యంలో ప్రాధికార, సుప్రీం ఆదేశాలను ఎలా పాటించాలనేది సిద్దరామయ్య సర్కారుకు చిక్కుముడిగా మారనుంది. కావేరి నిర్వహణా సంస్థల ఆదేశాలను కర్ణాటక ఆమోదించాలి, తమిళనాడుకు నీరు వదలాలని జడ్జిలు పేర్కొన్నారు.
కబిని, కృష్ణరాజసాగర్ తదితర డ్యాముల్లో జలాశయంలో కనిష్టస్థాయికి పడిపోయింది. అయినప్పటికీ నీటిని వదలడం సర్కారుకు మింగుడుపడని విధంగా పరిణమిస్తుంది. రాష్ట్రంలో తాగు, సాగు నీటి అవసరాలకు ఉన్న నీరు ఏమాత్రం సరిపోదు, రాబోయే వేసవి వరకు రిజర్వాయర్లలో నీటిమట్టాన్ని కాపాడుకోవడం అసాధ్యం అవుతుందని రైతులు వాపోయారు.
తమిళనాడుకు కావేరి నీటి విడుదల ఆదేశాలపై స్టే కోరిన సర్కారు
జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు
ఢిల్లీలోనే సీఎం, డిప్యూటీ సీఎం
కేంద్ర జలవనరుల మంత్రికి మొర
కేంద్రమంత్రికి అన్నీ చెప్పాం: సీఎం
కావేరి నీటి విషయమై కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమయ్యాం. ఆయన సానుకూలంగా స్పందించారని సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్ చెప్పారు. గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. తమ క్లిష్ట పరిస్థితిని వివరించాం, ప్రధాని మోదీని కలవడానికి సమయం కోరాం, అనుమతి వస్తే కలుస్తామన్నారు. కావేరిపై నాలుగు రాష్ట్రాలవారిని పిలిపించి మాట్లాడాలని ప్రధానిని కోరతామన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరువు ఉందని, తాగు, సాగు, పరిశ్రమలకు 106 టీఎంసీ నీరు అవసరముంది, కానీ డ్యాముల్లో 51 టీఎంసీలు మాత్రమే ఉందని కేంద్ర మంత్రికి తెలియజేశామన్నారు. గత 123 సంవత్సరాల్లోనే అత్యంత తక్కువ వర్షం ఆగస్టు, సెప్టెంబర్‌లో నమోదైందని సీఎం చెప్పారు. వదలడానికి మా వద్ద నీరు లేదని, రైతుల ఆందోళనల గురించి వివరించామన్నారు.



కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం, డిప్యూటీ సీఎం