
రామచంద్ర
కోలారు: నగరంలోని కలెక్టరేట్‌లో గురువారం జనతా దర్శన్ నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాధికారి అక్రం పాషా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నెలకోసారి జనతా దర్శన్, ప్రతి 15 రోజులకోసారి ఎంపిక చేసిన తాలూకా కేంద్రాల్లో జనతా దర్శన్‌ను నిర్వహిస్తారన్నారు. జనతా దర్శన్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 25న జిల్లా కేంద్రంలోని టి.చెన్నయ్య రంగమందిరంలో నిర్వహించే జిల్లా స్థాయి జనతా దర్శన్ విజయవంతానికి అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో సీఈఓ పద్మా బసవంతప్ప, కేజీఎఫ్ ఎస్పీ శాంతరాజు, అదనపు ఎస్పీ భాస్కర్, అన్ని తాలూకాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
యక్షగాన కళాకారుడి మృతి
యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపురకు చెందిన ప్రముఖ యక్షగాన కళాకారుడు రామచంద్ర నాయక్ హెమ్మనబైల్ (51) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. తన అద్బుతమైన కంఠసిరితో జిల్లాలో మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నారు.
దానిమ్మ పండ్ల దొంగల అరెస్ట్
చిక్కబళ్లాపురం: దానిమ్మ పండ్లను దొంగలించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కేబీ రాజు, శ్రీకాంత్‌లుగా గుర్తించారు. వీరిద్దరు ఇటీవల తాలూకా పరిధిలోని అజ్జావర, సాదేనహళ్లి గ్రామంలో రాత్రి వేళ దానిమ్మ తోటల్లో దాదాపు నాలుగు టన్నుల పండ్లను దొంగలించారు. పండ్లను చిక్కబళ్లాపురంలో విక్రయించారు. ఎస్‌ఐ ప్రదీప్ నేతృత్వంలో నిఘా ఉంచి నిందితులతో పాటు పండ్లను కొన్న వ్యాపారులను కూడా అరెస్ట్ చేశారు.
సమస్య పరిష్కారానికి కృషి
కంప్లి: సింగటాలూరు ఎత్తిపోతల పథకానికి భూములిచ్చిన రైతులు ఒప్పుకుంటే వెంటనే జిల్లాధికారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్టు హూవినహడగలి ఎమ్మెల్యే కృష్ణానాయక్ తెలిపారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజు శ్రీకాంత్
