
జాతాను ప్రారంభిస్తున్న సురేంద్రబాబు
రాయచూరు రూరల్: జిల్లాలో ఆరోగ్య పథకంపై జనజాగృతి జాతాకు యువత ముందుండాలని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు పేర్కొన్నారు. ఆయన గురువారం మహాత్మగాంధీ క్రీడా మైదానంలో జెడ్పీ, ఎయిడ్స్ నియంత్రణ కమిటీ, జిల్లా ఆరోగ్య శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, యువజన సేవా క్రీడా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంపై ప్రజలను చైతన్యపరచాలన్నారు. జాతాలో గణేష్, నందిత, షాకీర్, సంధ్య, కృష్ణవేణిలున్నారు.
మిద్దె పైనుంచి పడి
యువకుడు మృతి
రాయచూరు రూరల్: మిద్దె పైనుంచి పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నగరంలో జరిగింది. తిమ్మాపూర్‌పేటలో నివాసముంటున్న రమేష్(19) అనే యువకుడు బుధవారం రాత్రి వినాయకులను చూసి మిద్దైపె పడుకున్నాడు. గురువారం తెల్లవారు జామున కిందకు దిగుతుండగా అదుపు తప్పి కింద పడి మరణించినట్లు నేతాజీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ లక్ష్మి తెలిపారు. రమేష్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ గార పని చేసేవాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
జైన సన్యాసినుల ఊరేగింపు
రాయచూరు రూరల్: నగరంలో 13 మంది జైన కన్య సన్యాసినులను గురువారం సుమతీనాథ్ జైన భవనం నుంచి 13 రథాల్లో ఊరేగించారు. సిద్దిదాయక సిద్ది తపనవ్యాతి వర్ధమాన గచ్చాధిపతి దేవేష్ విజయ ప్రభు సూరేశ్వరి స్వామీజీ, సాక్షిజీ, కీర్తన ప్రభాశ్రీజీల ఆధ్వర్యంలో చాతుర్మాసం సందర్భంగా 33 మంది 45 రోజుల ఉపవాస దీక్షల ముగింపు కార్యక్రమం నెరవేరింది. కార్యక్రమంలో జైన సమాజం అధ్యక్షుడు ప్రకాష్, పుష్కరాజ్, రాజేంద్ర, అశ్విని, రంజితా, మదన్ లాల్, మున్నాబాయి, అశోక్ కుమార్ జైన్, నితిన్, కమల్‌కుమార్, కాంతిలాల్, మోహన్‌లాల్, సూరజ్‌లున్నారు.
ఏకగ్రీవ ఎంపిక
కంప్లి: వ్యవసాయ సేవా సహకార సంఘం(వీఎస్‌ఎస్‌ఎన్) నూతన అధ్యక్షునిగా బీజేపీ మద్దతు అభ్యర్థి బీ.సురేష్, ఉపాధ్యక్షురాలిగా దేవసముద్ర జయలక్ష్మి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గురువారం సంఘం ఆవరణలో సహకార సంఘాల అధికారి లింగరాజు ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఇద్దరూ ఏకగ్రీవంగా ఎంపికై నట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి ఇద్దరినీ పూలమాలలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రముఖులు బ్రహ్మయ్య, సిద్దప్ప, అళ్లళ్లి వీరేష్, పురుషోత్తం, సంఘం కార్యదర్శి సిద్దేష్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమార్కులపై చర్యలేవీ?
రాయచూరు రూరల్: ఆహార పౌర సరఫరాల శాఖలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టాలని జాతీయ సమాజ పరివర్తన సమితి జిల్లాధ్యక్షుడు మారెప్ప, జయ కర్ణాటక సంఘం అధ్యక్షుడు శివకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి వారు మాట్లాడారు. అధికారి అరుణ్ కుమార్ సంగావి, ఇన్‌స్పెక్టర్లు యంకన్న, ఖలీల్ అహ్మద్ రూ.2 కోట్లను స్వార్థానికి వాడుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి అధికారుల విచారణలో నిధులు దుర్వినియోగమైనట్లు వెల్లడైనా జిల్లాధికారి చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేయడాన్ని ఖండించారు. కమీషన్ పేరుతో నామ్‌కే వాస్తేగా నివేదికలు సమర్పించారన్నారు. ప్రభుత్వ నిధులు వాడుకున్న అధికారులు, ఇన్‌స్పెక్టర్లను జిల్లాధికారి సస్పెండ్ చేయాలని కోరుతూ అదనపు జిల్లాధికారి దురుగేష్‌కు వినతిపత్రం సమర్పించారు.

అధ్యక్ష, ఉపాధ్యక్షులను పూలమాలలతో అభినందిస్తున్న సభ్యులు

జైన సన్యాసినులను ఊరేగిస్తున్న దృశ్య

వినతిపత్రం సమర్పిస్తున్న మారెప్ప