శ్రీనివాసపురం: అన్నభాగ్య పథకం ద్వారా ఇస్తున్న డబ్బులు అంత్యోదయ కార్డు, బీపీఎల్ కార్డులు కలిగిన పేద చిట్టచివరి వ్యక్తికి కూడా అందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కెహెచ్ మునియప్ప సూచించారు. గురువారం ముళబాగిలు టీపీ సభాంగణంలో ఏర్పాటు చేసిన తాలూకా స్థాయి అధికారుల సమావేశంలో మాట్లాడారు. ఇంకా ఖాతాలకు డబ్బులు అందని లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించి నెలరోజులలోగా నివేదికను సమర్పించాలన్నారు. జిల్లాలో అన్ని బియ్యం గోదాములను నెలకు రెండుసార్లు సందర్శించి బియ్యం స్టాకుల గురించి తెలుసుకోవాలన్నారు. బియ్యం నాణ్యతను కూడా పరిశీలించాలన్నారు. జిల్లాలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే అలాంటి వారికి అంత్యోదయ కార్డులు అవసరమైతే వెంటనే అందించాలన్నారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరైన రీతిలో విక్రయిస్తున్నారా, లేదా? తూకాలలో లోపాలు జరుగుతున్నాయా? అనే విషయంపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో టీపీ ఈఓ సర్వేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.