
గౌరిబిదనూరు: శ్రీకృష్ణుని జీవితం నేటి సమాజానికి ఆదర్శమని, భగవద్గీతలో చెప్పిన విషయాలను ఆచరించి ఎందరో మహానుభావులు ఆదర్శ పురుషులయ్యారని ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ జ్ఞానవికాస కార్యక్రమం సమన్వయాధికారి అశ్విని తెలిపారు. శుక్రవారం హుసేన్‌పుర గ్రామంలో ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి సంపిగె గ్రూప్ వారిచే జరిగిన శ్రీ కృష్ణ జన్మాష్టమి ఆచరణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారుల రాధాకృష్ణుల వేషధారణ ఆకట్టుకుంది.
కార్యక్రమంలో నోడల్ అధికారి హరీశ్, సేవా ప్రతినిధి రాజమ్మ, కేంద్ర సభ్యులు పాల్గొన్నారు.
బైక్‌లో వచ్చి చైన్‌స్నాచింగ్
శివమొగ్గ : దుండగులు చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఘటన సాగర పట్టణంలో చోటు చేసుకుంది. వినోబానగరకు చెందిన యశోధ అనే మహిళ శుక్రవారం ఉదయం తన ఇంటి ముందు నిలబడి ఉండగా బైకులో వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారం మాంగళ్య చైన్ లాక్కొని ఉడాయించారు. ఈ దృశ్యం అక్కడి సీసీకెమెరాలో రికార్డు అయ్యింది. బాధితురాలి ఫిర్యాదుతో సాగర పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
దొంగ అరెస్ట్, నగదు స్వాధీనం
శివమొగ్గ : చోరీలకు పాల్పడుతున్న భద్రావతి తాలూకా జేడికట్టి గ్రామానికి చెందిన ప్రజ్వల్ అనే దొంగను భద్రావతి న్యూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని వద్దనుంచి రూ.34 వేల నగదు, రూ. 18 వేల విలువైన పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 10న జెడికట్టిరెమడు హోటల్, రాజప్ప లేఔట్‌లోని నందిని మిల్క్ పార్లర్, మాచెనహళ్లిలోని భవాని స్టీల్ ఫ్యాక్టరీలో నిందితుడు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
కోర్టు కార్యకలాపాల బహిష్కరణ
గౌరిబిదనూరు: జిల్లా కేంద్రం చిక్కబళ్లాపురం కోర్టులో న్యాయవాది హొళవనహళ్లి రమేశ్‌పై దాడి చేయడాన్ని ఖండిస్తూ న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ అధ్యక్షుడు రామదాస్ మాట్లాడుతూ...గురువారం కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో జడ్జి ఎదురుగా న్యాయవాది హొళవనహళ్లి రమేశ్‌పై దాడి చేయడం దారుణమన్నారు. దీంతో శుక్రవారం కేసులను వాయిదా వేయాలని ప్రధాన సివిల్ జడ్జికి వినతిపత్రం అందజేశారు. బార్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి దయానంద్, కోశాధికారి జగదీశ్, ఉపాధ్యక్షుడు విజయరాఘవ, జాయింట్ కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
హత్య కేసులో అరెస్ట్
మైసూరు: హత్య కేసులో జయనగర పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివరాలు...మైసూరు నగరంలోని రాజేంద్రనగరలో నివాసం ఉంటున్న అప్సర్‌పాషా మాంసం దుకాణం కోసం మహాదేవ అనే వ్యక్తి వద్ద రూ. 1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. నెలలు గడచినా అప్పు తీర్చకపోవడంతో మహాదేవ ఇటీవల అప్సర్‌ను నిలదీశాడు. దీంతో రెండు రోజుల క్రితం అప్సర్ నగదు ఇస్తామని మహాదేవను కెర్గళ్లిలోని మామిడి తోపు వద్దకు పిలిపించాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అప్సర్ మహాదేవను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. మహాదేవ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఏనుగు సంచారంతో భయాందోళనలు
దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ తాలూకా బీవీ హళ్లి గ్రామంలో ఒంటరి ఏనుగు చల్‌చల్ చేసింది. గురువారం రాత్రి గ్రామంలో ప్రవేశించిన ఒంటరి ఏనుగు తిమ్మేగౌడ అనే ఉపాధ్యాయుడి ఇంటి పెరట్లోకి దూరి దొరికిన వాటిని తొండంతో విసిరేసింది. తరువాత ఇళ్ల ముందు సంచరిస్తూ చెట్లు విరిచేస్తూ దొరికిన వస్తువులను తొక్కి పడేసింది. దీంతో గ్రామస్తులు సురక్షిత ప్రదేశానికి పరుగులు తీసారు. అయితే గ్రామస్తుల అరుపులతో బెదిరిపోయిన ఏనుగు అడవిలోకి పారిపోయింది. అడవి ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా నియంత్రించాలని గ్రామస్తులు అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.

చైన్‌లాక్కొని బైక్‌లో ఉడాయిస్తున్న దొంగలు

స్వాధీనం చేసుకున్న నగదు, పొగాకు ఉత్పత్తులు