
సాక్షి, బెంగళూరు: ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే ధనబలమే కాదు బుద్ధిబలం కూడా ఎంతో ముఖ్యం. ఇందుకుగాను పార్టీల కోసం కార్పొరేట్ వ్యూహకర్తలు, బృందాలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఉండడంతో మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు ప్రైవేటు వ్యూహ బృందాలపై ఆధారపడుతున్నాయి. ఇంటింటి ప్రచారం, ఓటర్ల మనసులు గెలిచే ప్రణాళికలు, ప్రత్యర్థులపై పైచేయి కోసం పార్టీలు శ్రమిస్తున్నాయి. ఏ విధంగా పనిచేస్తే నెగ్గుకురావచ్చో కార్పొరేట్ వ్యూహకర్తలు మేధో సాయం చేస్తారు. ఈ వ్యూహకర్తల కోసం వివిధ రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.
వ్యక్తులకు కూడా స్ట్రాటజీ టీమ్‌లు
స్ట్రాటజీ బృందాలను పార్టీలే కాదు, వ్యక్తులు కూడా వాడుకోవచ్చు. అభ్యర్థి లేదా నాయకుల తరపున కూడా ఈ బృందాలు పని చేస్తున్నాయి. సీఎం బసవరాజు బొమ్మై, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తరపున వ్యక్తిగతంగా ప్రత్యేక బృందాలు పని చేస్తున్నట్లు తెలిసింది. కొందరు బడా ఎమ్మెల్యేలు కూడా ఇలా వ్యూహకర్తలను నియమించుకుని నియోజకవర్గంలో ఓటర్ల నాడి ఎలా ఉందో ఆరా తీస్తున్నారు. నేతల తరఫున డిజిటల్ ప్రచారం, సోషల్ మీడియా, ప్రచార కార్యక్రమాలను కూడా ఈ వ్యూహ బృందాలు నిర్వహిస్తున్నాయి. ఇందుకు నేతలు భారీగానే ముట్టజెప్పాలి.
డబ్బులు కుమ్మరిస్తున్న పార్టీలు
ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా కొత్త శైలిని అందుకున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ స్ట్రాటజీ టీమ్‌లపై నేతలు, పార్టీలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. క్షేత్ర స్థాయి నుంచి సమాచారాన్ని తెప్పించుకోవడం, అందుకు అనుగుణంగా ఎన్నికల కార్యాచరణ రూపొందించుకోవడం ప్రస్తుతం నేతలు చేస్తున్న పని.. ఈ క్రమంలో ఈ స్ట్రాటజీ టీమ్‌లకు ఎన్నికల నేపథ్యంలో మంచి డిమాండ్ ఏర్పడింది. రాజకీయ పా ర్టీలు కూడా ఈ బృందాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదు.
పార్టీలకు స్ట్రాటజీ టీమ్‌ల మేధోసాయం
ఎన్నికల వేళ గిరాకీ మెండు
ప్రజల్లో కలిసిపోయి సమాచార సేకరణ
కార్పొరేట్ శైలిలో స్ట్రాటజీ బృందాలు పనిచేస్తాయి. లోతుగా సర్వేలు చేపట్టడం, పోటీ అభ్యర్థి కార్యవైఖరి గుర్తించడం, ఓటర్ల మనోగతం తెలుసుకోవడం వంటివి ప్రధానంగా ఉంటాయి. ఈ సంస్థల సిబ్బంది ప్రజల్లో కలిసిపోయి సమాచారం సేకరిస్తారు. తద్వారా ఓటర్ల మనోగతం ఏ పా ర్టీకి అనుకూలంగా ఉందో తెలుసుకోవడంతో పాటు ఎలాంటి కార్యక్రమాలు, పథకాలు, హామీలు గుప్పిస్తే ప్రజల మనస్సులను తమ వైపునకు తిప్పుకోవచ్చో తదితర సమాచారాన్ని పార్టీలకు అందిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలను సేకరించే ప్రయత్నాలు కూడా సాగిస్తున్నాయి. 224 నియోజకవర్గాల్లో సమర్థవంతుడైన గెలుపు గుర్రాల వంటి అభ్యర్థులను పార్టీ అధిష్టానాలకు సూచిస్తాయి.
