
పాల్గొన్న ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి తదితరులు
శివాజీనగర: రాష్ట్రంలో 25 జిల్లాల్లో టెక్స్‌టైల్ పార్కులను స్థాపిస్తామని సీఎం బొమ్మై తెలిపారు. మంగళవారం కల్బుర్గిలో పీడీఏ ఇంజనీరింగ్ కాలేజీ సభా మందిరంలో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించారు. రాయచూరు, విజయపుర జిల్లాల్లో తొలి పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కును స్థాపిస్తాం, ఆ తరువాత మిగతా జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కాగా మరో ఐదు సంవత్సరాల్లో అన్ని విద్యాసంస్థలు ఐఐటీ తరహాలో ఉంటాయని సీఎం అన్నారు. బెంగళూరు జ్ఞానజ్యోతి సభా మందిరంలో తొమ్మిది నూతన విశ్వవిద్యాలయాలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఐఐటీలను వెతుక్కుని వెళ్లకుండా ఇక్కడే ఐఐటీ వంటి విద్యాలయాలను సృష్టిస్తామన్నారు.
రోడ్డు పనులకు అంకురార్పణ
గంగావతి: భారీ వర్షానికి అళ్లళ్లి నుంచి గిణిగెర వరకు దెబ్బ తిన్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి భూమిపూజను నెరవేర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాలకు తన హయాంలో రోడ్లను నిర్మించామన్నారు. మరోసారి అవకాశం కల్పిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానన్నారు. గ్రామ ప్రముఖులు శంకరప్ప, విజయ్‌కుమార్, ప్రకాశ్ కడగద్, లక్ష్మణ అళ్లళ్లి, మారుతీ శరణేగౌడ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మహబూబ్ నగర్‌లో రూ.1 లక్ష నిధులను తాయమ్మ దేవస్థాన అభివృద్ధి కమిటీ వారికి అందజేశారు.
కొత్త విద్యా విధానానికి శ్రీకారం
రాయచూరు రూరల్ : వర్సిటీలో నూతన విద్యా విధానాన్ని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆన్‌లైన్ ద్వారా రిమోట్‌తో ప్రారంభించారు. మంగళవారం వర్సిటీలో శిలాఫలకాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉన్నత విద్యా శాఖలో నూతనంగా ఏడు వర్సిటీలను అప్‌గ్రేడ్ చేశామని సీఎం బొమ్మై తెలిపారు. వర్సిటీల్లో నూతన పరిశోధనలు, ఆవిష్కారాలు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులు డిగ్రీ, పీజీ పట్టాలకు పరిమితం కాకుండా జ్ఞానార్జనకు ముందుండాలన్నారు. వైస్ చాన్స్‌లర్ హరీష్ రామస్వామి, అధికారులు బిరాదార్, విశ్వనాథ, యర్రిస్వామి, నుస్రత్ ఫాతిమా, పార్వతి, భాస్కర్, రాఘవేంద్ర, అనిల్, పంపాపతిలున్నారు.
నవమికి కోలాటం కసరత్తు
బళ్లారిఅర్బన్: నగరంలో ఈనెల 30వ తేదీ గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకుని మహిళలు ముందస్తుగా మంగళవారం కోలాటం ప్రదర్శనపై కసరత్తు ప్రారంభించారు. రెడ్డి వీధి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మమతా మహిళా బృందంతో కలిసి కోలాటం, భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్, వివిధ నృత్యాల కసరత్తును మాస్టర్ ప్రతిమ నిర్వహించారు. మూడు రోజులుగా సీతారాముల కల్యాణోత్సవం రోజున వేడుకలు జరుపుకునేందుకు మహిళలు శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత మహిళలు మమత, నిర్మల, రుక్మిణి, సువర్ణ, గాయత్రి, లక్ష్మీ, శృతిలతో పాటు చిన్నారులు పాల్గొన్నారు.
బీజేపీలోకి కార్యకర్తల చేరిక
రాయచూరు రూరల్: వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు బాబురావ్ పేర్కొన్నారు. మంగళవారం నగరంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను వీడి బీజేపీలో చేరిన సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం విరివిగా అభివృద్ధి పనులను చేసిందని వివరించారు.
రిజర్వేషన్లలో ముస్లింలకు మోసం
రాయచూరు రూరల్: బీజేపీ సర్కార్ ౖరాష్ట్రంలో మెనార్టీలకున్న 4 శాతం రిజర్వేషన్లను ఇతర వర్గాల వారికి కేటాయించి మోసం చేసిందని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మైనార్టీల రిజర్వేషన్లను తొలగించడం తగదన్నారు. నేతలు శివశంకర్, విశ్వనాథ్ పట్టి, యూసఫ్ ఖాన్‌లున్నారు.
సమాజ సేవా భార్గవ ప్రశస్తి ప్రదానం
కంప్లి: హొసపేటె సంగీత భారతి అధ్యక్షులు పీ.కల్లంభట్ ఆధ్వర్యంలో పట్టణంలోని భారతి శిశు విద్యాలయపు విజ్ఞాన ఉపాధ్యాయుడు ఎస్.శ్యామసుందరరావుకు సమాజ సేవా భార్గవ ప్రశస్తిని అందించి సత్కరించారు.
విద్యా విలువలకు పురస్కారం
అనంతపురం: మైసూరులోని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకులను అకడమిక్ పరంగా ఉత్తేజితులను చేయడానికి ఈ సంవత్సరం నుంచి అకాడమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డు, బెస్ట్ రీసెర్చ్ పేపర్ అవార్డును వర్సిటీ తరఫున ప్రదానం చేయనున్నట్లు వీసీ ప్రొ.శరణప్ప వి.హలసె తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది అకడమిక్ పరంగా ప్రథమవరుసలో నిలిచిన తెలుగు విభాగాధిపతి ఆచార్య ఎం.రామనాథం నాయుడుకు అకాడమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డును, అలాగే రూ. 25 వేల నగదు బహుమతిని అందజేశారు. అవార్డును అందుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

అవార్డు అందుకుంటున్న ప్రొఫెసర్ రామనాథం నాయుడు