
ఐకాన్స్‌ను సన్మానిస్తున్న దృశ్యం
బనశంకరి: సిలికాన్ నగరంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కార్యక్రమాలపై ప్రజలను జాగృతం చేయడానికి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ అనుప్ శ్రీధర్‌తో పాటు ఐదుగురు ప్రముఖులను నమ్మ బెంగళూరు ఐకాన్స్‌గా నియమించినట్లు నగరజిల్లా ఎన్నికల అధికారి, పాలికె కమిషనర్ తుషార్ గిరినాథ్ తెలిపారు. మంగళవారం నగరంలోని టౌన్ హాల్‌లో ఐకాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు వేసేలా నగర ప్రజల్లో ఆసక్తి పెంపొందించాలన్నారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని విధాలా సౌలభ్యాలు కల్పించినప్పటికీ కూడా ఓటుహక్కు వినియోగించుకునే వారి సంఖ్య తక్కువగా ఉంది. మీకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు వేయవచ్చు, కానీ అందరూ ఓటేయాలని కోరారు.
ఐకాన్స్ వీరే
పోలీస్ కమిషనర్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనాలని మనవిచేశారు. బెంగళూరు నగరం శరవేగంగా పెరుగుతోందని, కానీ ఓటు విషయంలో చాలా వెనుకబడి ఉందన్నారు. దీనిపై ప్రజల్లో జాగృతం చేసి అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని తెలిపారు. బెంగళూరు ఐకాన్స్‌గా అనుప్ శ్రీధర్, క్రీడాకారులు శరత్ ఎం.గైక్వాడ్, తేజస్విని బాయ్, మోహన్‌కుమార్, బుడకట్టు గాయకుడు ఆనంద్ హెచ్ ఎంపికయ్యారు. ఐకాన్స్‌ను సన్మానించారు.
ఎన్నికల ప్రచారానికి ఐదుగురు ఐకాన్స్