
యడియూరప్ప నివాసంలో అల్పాహారం తీసుకుంటున్న అమిత్ షా, బొమ్మై, మంత్రులు
శివాజీనగర: విధానసభ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈక్రమంలో పార్టీ ఢిల్లీ పెద్దల రాకపోకలు జోరందుకున్నాయి. నెల రోజులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి విచ్చేసి నేతలతో పలుసార్లు భేటీలు నిర్వహించారు. గురువారం సాయంత్రం బెంగళూరుకు చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్ప ఇంటికి వెళ్లారు. యడియూరప్ప, సీఎం బొమ్మైతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అమిత్‌షా యడియూరప్పకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఆయన ఇంటికి వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. యడియూరప్ప తనయుడు విజయేంద్ర అమిత్‌షాకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. యడియూరప్ప ఇంటిలో అల్పాహారం తీసుకున్న తర్వాత యడియూరప్ప, సీఎం బసవరాజ బొమ్మై, నేతలు అరుణ్‌సింగ్, నళీన్‌కుమార్ కటీల్, ఉపాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, మంత్రులు గోవింద కారజోళ, బీ.శ్రీరాములు, రాష్ట్ర సంఘటన కార్యదర్శి రాజేశ్‌తో అమిత్‌షా చర్చించారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరుతున్నారనే సమాచారాన్ని ప్రస్తావిస్తూ అసంతృప్తులతో మాట్లాడాల న్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు చేయాలని సూచించినట్లు తెలిసింది.