
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సర్కిల్ వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
శివాజీనగర: షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు పెంచుతామని అధికార బీజేపీ తప్పుడు వాగ్దానాలు చేసి దళితులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నగరంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టారు.
కేపీసీసీ కార్యాలయం నుంచి ర్యాలీ ఆరంభించి రాజభవన్ ముట్టడికి ప్రయత్నించిన సిద్దరామయ్య, డీ.కే.శివకుమార్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నాలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్, విధానపరిషత్ ప్రతిపక్ష నాయకుడు బీ.కే.హరిప్రసాద్, కార్యధ్యక్షులు రామలింగారెడ్డి, సలీం అహమ్మద్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌కు సంబంధించి షెడ్యూల్డ్ 9కు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారస్సు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓట్ల కోసం తప్పుడు హామీలు
ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య మాట్లాడుతూ... రిజర్వేషన్లు పెంచిన విషయానికి సంబంధించి 9వ షెడ్యూల్డ్‌లో చేర్చేందుకు ఇన్ని రోజులు జాప్యం చేసినందుకు రిజర్వేషన్ పెంపునకు ఆదేశాలు ఎప్పుడయ్యాయని ప్రశ్నించారు. కేవలం ఓటు కోసం ప్రజలను తప్పుదారి పట్టించి మోసం చేస్తున్నారని విమర్శించారు.
దళితులకు మోసం:
ఇదే సమయంలో మాట్లాడిన డీ.కే.శివకుమార్, దళితులను ఎంతవరకు మోసం చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడచుకుంటోదని మండిపడ్డారు. మాజీ డీసీఎం జీ.పరమేశ్వర్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ నాయకులు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ధర్నా చేపడుతున్నామని తెలుసుకొని రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వ సిఫారస్సుకు పంపారని ధ్వజమెత్తారు. రాజభవన్ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సర్కిల్ వద్ద అడ్డుకొన్న పోలీసులపై మండిపడ్డారు. ఆ తరువాత కాంగ్రెస్ నాయకులు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సర్కిల్ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు సిద్దరామయ్య, డీ.కే.శివకుమార్‌తో పాటు పలువురి నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా క్వీన్స్ రోడ్డులో గంటకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
బెంగళూరులో కాంగ్రెస్ చలో రాజ్‌భవన్
పలువురు నేతల అరెస్ట్