
శివాజీనగర: సిగరెట్ విషయంలో స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీయగా ఒకరు మృతిచెందారు. ఉప్పారపేట గణేశ ఆలయ సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హతుడిని కలబురిగికి చెందిన మల్లినాథ్ బిరాదర్ (36)గా పోలీసులు గుర్తించారు. వివరాలు.. ఉత్తర కర్ణాటకకు చెందిన మల్లినాథ్ బిరాదర్, మంజునాథ్, చిక్కమగళూరుకు చెందిన గణేశ్ స్నేహితులు. వంట, ఇతర చిన్నపాటి పనులు చేసుకొని చేతికి వచ్చిన సొమ్ముతో మద్యం సేవించి రాత్రి సమయంలో మెజిస్టిక్ చుట్టు పక్కల ప్రాంతాల్లో నిద్రించేవారు. బుధవారం రాత్రి ముగ్గురి మధ్య సిగరెట్ తాగే విషయానికి గొడవ జరిగింది. మంజునాథ్, మల్లినాథ్ బిరాదర్ గణేశ్‌పై దాడి చేశారు. గురువారం ముగ్గురూ ఎప్పటిలాగానే పనులకు వెళ్లారు. సాయంత్రం మళ్లీ కలసి మద్యం సేవించి గణేశ్ ఆలయం వద్దకు వెళ్లారు. బుధవారం జరిగిన గొడవ చర్చకు వచ్చింది. ఆవేశానికి గురైన గణేశ్ చాకుతో మంజునాథ్, మల్లినాథ్ బిరాదర్ కడుపులో పొడిచాడు. మల్లినాథ్ బిరాదార్ మృతిచెందగా, మంజునాథ్‌ను ఆస్పత్రికి తరలించారు. గణేశ్‌కు గాయాలు కాగా, చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఉప్పారపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
కత్తిపోట్లకు గురై ఒకరి మృతి