
బీజేపీకి 120 ప్లస్ సీట్లు అని నేసిన చీరను ప్రదర్శిస్తున్న తృప్తి సాలిమట్, మేఘరాజ్
కంప్లి: పట్టణంలోని 110 కేవీ ఉపకేంద్రంలో అత్యవసర మరమ్మతు పనుల నిర్వహణ నేపథ్యంలో పట్టణంతో పాటు గ్రామాల్లో ఈనెల 26న ఉదయం 9 గంటల సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని జెస్కాం ఏఈ వినోద్‌కుమార్ బ్యాలాళ్ ఓ ప్రకటనలో తెలిపారు.
కారులో రూ.53 లక్షలు సీజ్
హుబ్లీ: ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.53 లక్షల నగదును ధార్వాడ గరగ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. తేగూరు హైవే–4లో ఈ ఘటన చోటు చేసుకుంది. చెక్‌పోస్ట్ వద్ద పరిశీలిస్తున్న వేళ ఇన్నోవా కారులో నగదు దొరికింది. బెళగావి జిల్లా చిక్కోడి నుంచి హావేరి జిల్లా తడసకు నగదును చేర్చేందుకు తరలిస్తున్నట్లు తెలిసింది. కారులో సంజు హిరేమఠ అనే వ్యక్తి ఈ నగదును తీసుకెళుతున్నాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదును, ఇన్నోవా కారును సీజ్ చేశారు. గరగ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రూ.3 లక్షల నగదు స్వాధీనం
రాయచూరు రూరల్: అక్రమంగా కారులో తరలిస్తున్న రూ.3 లక్షల నగదును శక్తినగర్ చెక్‌పోస్టులో గురువారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ తాలూకా కృష్ణా మండలం బైపాస్ రహదారి వద్ద తనిఖీ చేపట్టగా, ఆ సమయంలో కారుకు నంబర్ బోర్డు లేకపోవడం, ఎలాంటి రికార్డులు లేని కారణంగా ఈ డబ్బును స్వాధీనపర్చుకొని కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచడానికి ఈ డబ్బును తీసుకెళుతున్నట్లు అందిన సమాచారంతో నగదును సీజ్ చేశామన్నారు.
అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక
కంప్లి: ముద్దాపుర అగసి వద్ద గల ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం నూతన అధ్యక్షునిగా అళ్లి నాగరాజ్, ఉపాధ్యక్షునిగా డీ.మురారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గురువారం సంఘం కార్యాలయంలో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన డీఆర్‌ఓ కార్యాలయ అధికారి నూర్ మొహ్మద్ ప్రకటించారు. సంఘం గత అధ్యక్ష, ఉపాధ్యక్షులైన బళె వీరేష్, శెరగార రాజేష్‌ల రాజీనామాల వల్ల ఈ ఎంపిక జరిగిందన్నారు. అధికారికంగా నూతన అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎంపిక జరిపామని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఈఓ హెచ్.ఈరణ్ణ, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
బీజేపీకి 120 సీట్లు రావాలని చీరపై చేనేత
రాయచూరు రూరల్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి మరోసారి బీజేపీ విజయ కేతనం ఎగరేయాలని బాగలకోటె జిల్లా ఇలకల్‌లో చేనేతకారులు చీరపై తమ చేనేత కళను రూపుదిద్దారు. రెండు రోజుల క్రితం ఇలకల్ చీరల రాయబారి తృప్తి సాలిమట్ బీజేపీకి 120కి పైగా సీట్లు రావాలని నేసిన చీరను ప్రదర్శించారు. ఇలకల్‌లో చేనేతకారుల సమ్మాన్ పథకం ద్వారా లబ్ధి పొందిన చేనేతకారుడు మేఘరాజ్ బీజేపీ కమలం గుర్తుపై 120 ప్లస్ అంటూ తన ప్రతిభను చీరపై కనబరిచారు.
లాడ్జి గదిలో ఇద్దరి
మృతదేహాలు లభ్యం
●అనుమానాస్పద మృతులుగా
కేసు నమోదు
హొసపేటె: విజయపురలోని ఓ లాడ్జి గదిలో విజయనగర జిల్లాకు చెందిన ఇద్దరి మృతదేహాలు వెలుగు చూసిన ఘటన శుక్రవారం జరిగింది. పోలీసు వివరాల మేరకు..విజయపురలోని రాజధాని లాడ్జి గదిలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా కృష్ణాపుర తాండ నివాసి సీ.ఇంద్రకుమార్‌తో పాటు మరో వ్యక్తి లాడ్జిలో మృతి చెందారని తెలిపారు. రెండు రోజులు క్రితం ఇంద్రకుమార్ విజయపురలోని రాజధాని లాడ్జిలో గది నెంబర్–114లో బస చేశారు. అనంతరం అతని గదిలోకి మరో వ్యక్తి చేరారు. ఇంద్రకుమార్‌తో కలిసి ఉన్న మరో వ్యక్తి ఇంద్రకుమార్‌ను హత్య చేసిన అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల నుంచి లాడ్జిలోని గది తలుపులు తెరవక పోవడంతో లాడ్జి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గది తలుపులు తెరచి చూడగా పక్కపక్కనే ఇద్దరి మృతదేహాలు పడి ఉన్నాయి. మృతి చెందిన మరో వ్యక్తి పేరు, వివరాలు తెలియరాలేదు. వివరాల కోసం సమగ్ర విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు.

అధ్యక్ష, ఉపాధ్యక్షులను సన్మానిస్తున్న దృశ్యం

కారు డిక్కీలో పట్టుబడిన నగదు కట్టలు