
బళ్లారిలోని సిటీ కార్పొరేషన్ కార్యాలయం
సాక్షి,బళ్లారి: ప్రస్తుతం కొనసాగుతున్న మేయర్ మోదుపల్లి రాజేశ్వరి, ఉపమేయర్ మాలన్‌బీ పదవీ కాలం ఈనెల 18వ తేదీకి ముగిసిన తరుణంలో రెండో అవఽధి కింద మేయర్, ఉపమేయర్ ఎన్నిక కోసం ప్రభుత్వం తేదీని, రిజర్వేషన్లను కూడా ఖరారు చేసింది. మేయర్ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించగా, ఉపమేయర్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆ వర్గాలకు చెందిన కార్పొరేటర్లు పదవులు దక్కించుకునేందుకు తమదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 29న ఎన్నిక జరగనున్న తరుణంలో రిజర్వేషన్ అర్హత కలిగిన కార్పొరేటర్లు పదవులు ఎలా దక్కించుకోవాలోనని మల్లగుల్లాలు పడుతున్నారు. బళ్లారి సిటీ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 39 వార్డులకు గాను 21 స్థానాల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు, 13 స్థానాల్లో బీజేపీ కార్పొరేటర్లు, ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో సిటీ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ పట్టు సాధించడంతో తొలి విడత మేయర్, ఉపమేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన మోదుపల్లి రాజేశ్వరి, మాలన్‌బీ ఎన్నిక కాగా వారి పదవీ కాలం కూడా ముగిసింది.
జోరందుకున్న పైరవీలు
ఈనేపథ్యంలో రెండో అవధిలో మేయర్, ఉపమేయర్ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్ వారే ఎన్నిక అవుతారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బీజేపీకి చెందిన కార్పొరేటర్లు 13 మంది ఉండటంతో పోటీ చేస్తారా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. ఒకవేళ పోటీ చేసినా కాంగ్రెస్ లేదా స్వతంత్ర అభ్యర్థులకు గాలం వేయాలి. ఇదంతా పక్కన పెడితే నగర మేయర్, ఉపమేయర్ పదవి కోసం కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్లు దక్కించుకునే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన వారిలో మేయర్ రేసులో ఎస్సీ వర్గానికి చెందిన 4వ వార్డు కార్పొరేటర్ త్రివేణి కమేలా సూరి, 7వ వార్డు కార్పొరేటర్‌గా ఉమాదేవి, 29వ వార్డు కార్పొరేటర్ శిల్పా, 31వ వార్డు కార్పొరేటర్ శ్వేతా సోము, 38వ వార్డు కార్పొరేటర్ కుబేర, 35వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన 35వ వార్డు కార్పొరేటర్ మించు శ్రీనివాస్ కూడా మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఆరుగురు కార్పొరేటర్లలో త్రివేణి, కుబేర, శ్వేత, ఉమాదేవి మేయర్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే నాగేంద్ర మద్దతు కీలకం
మేయర్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో పురుషులకు ఇవ్వాలని, ఉపమేయర్ ఎలాగూ మహిళలకు రిజర్వ్ అయినందున మహిళలకు దక్కుతుందని, తనకే మేయర్ పదవిని ఇవ్వాలని కార్పొరేటర్ కుబేర పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. నగర మేయర్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈయన ఎవరికి మద్దతు సూచిస్తారన్న విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. ఉపమేయర్ రేసులో 33వ వార్డు కార్పొరేటర్ జానకమ్మ, 39వ వార్డుకు కార్పొరేటర్ శశికళ జగన్నాథ్, 14వ వార్డు కార్పొరేటర్ బీఆర్‌ఎల్ రత్నమ్మ ఉన్నారు. మొత్తం మీద బళ్లారిలో ఒక వైపు అసెంబ్లీ ఎన్నికల వేడి, మరోవైపు వేసవి ఎండల ప్రతాపం, ఇంకోవైపు త్వరలో జరగనున్న నగర మేయర్, ఉపమేయర్ ఎన్నికల హీట్ మధ్యన ఎవరిని పదవులు వరిస్తాయోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
ఈ నెల 29న ఎన్నికకు ముహూర్తం ఖరారు
మేయర్‌గిరి రేసులో ఆరుగురు కార్పొరేటర్లు
ఉపమేయర్ పదవి కోసం బరిలో ముగ్గురు