మళ్లీ బీజేపీదే అధికారం | - | Sakshi
Sakshi News home page

మళ్లీ బీజేపీదే అధికారం

Mar 25 2023 12:42 AM | Updated on Mar 25 2023 12:42 AM

కోలారు ఎంపీ ఎస్‌.మునిస్వామి

మాలూరు : రాష్ట్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని కోలారు ఎంపీ ఎస్‌.మునిస్వామి తెలిపారు. గురువారం రాత్రి తాలూకాలోని మాస్తి ఫిర్కా దిన్నహళ్లిలో బీజేపీ యువ నాయకుడు జలంధర్‌ తన స్వంత ఖర్చుతో ఏర్పాటు చేసిన హైమాక్స్‌ దీపాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మాలూరు టికెట్‌ విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. గెలిచే వారికే టికెట్‌ కేటాయిస్తారన్నారు. మాలూరులో మంజునాథ్‌గౌడను పార్టీలోకి తీసుకున్నప్పుడే పార్టీ ఆయనకు మాలూరు టికెట్‌ కేటాయిస్తామని మాట ఇచ్చిందన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తనకు మాలూరులో 37 వేల ఓట్ల మెజారిటీ లభించిందన్నారు. తాలూకా అభివృద్ధి కోసం మళ్లీ మంజునాథ్‌గౌడను గెలిపించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కె ఎస్‌ మంజునాథ్‌గౌడ, సమాజ సేవకుడు జలంధర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

‘నందిని’ ప్రతి ఒక్కరి దరిచేరాలి

కోలారు : ప్రతి ఒక్కరికీ ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో నందిని పార్లర్లను విరివిగా ప్రారంభిస్తున్నట్లు కోముల్‌ డైరెక్టర్‌ డి.వి.హరీష్‌ తెలిపారు. శుక్రవారం నగరంలోని మెక్కె సర్కిల్‌లోని పోలీస్‌ కల్యాణ మంటపం ప్రాంగణంలో నందిని ఉత్పత్తుల దుకాణాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. నగరంలోని బంగారుపేట రోడ్డు, టీకల్‌ రోడ్డు, మెడికల్‌ కళాశాల సమీపంలో, పలు చోట్ల నందిని విక్రయ కేంద్రాలను స్థాపించామన్నారు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై అజ్జప్పనహళ్లి గేట్‌ వద్ద సుమారు రూ.కోటి వ్యయంతో అత్యాధునిక నందిని కేంద్రం స్థాపనకు 10 గుంట్ల స్థలాన్ని రైతుల నుంచి లీజుకు తీసుకున్నట్లు తెలిపారు. కోముల్‌ ఎండీ గోపాలమూర్తి, పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు బివి గోపినాథ్‌, టౌన్‌ సీఐ ఎం గొరవినకొళ్ల పాల్గొన్నారు.

ముస్లిం సోదరులతో

అభ్యర్థి ప్రత్యేక ప్రార్థనలు

గంగావతి రూరల్‌: కనకగిరిలో శుక్రవారం ప్రచారంలో భాగంగా కనకగిరి అసెంబ్లీ నియోజకవర్గ కేఆర్‌పీపీ అభ్యర్థి డాక్టర్‌ చారుల్‌ దాసరి ముస్లిం మత పెద్దలతో కలసి ప్రార్థన చేశారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని అభ్యర్థించారు. మైనార్టీ సోదరులు తమకు ఈద్గా మైదానంలో ప్రార్థన కోసం ప్రత్యేకంగా గోడను నిర్మించాలని కోరారు. స్పందించిన అభ్యర్థి తప్పకుండా రాబోయే రోజుల్లో సువ్యవస్థితమైన ప్రార్థన గోడను నిర్మిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బళ్లారి అలీఖాన్‌, మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement