రెండో భార్య చేతిలో పోలీసు కానిస్టేబుల్‌ హత్య

Police killed by second wife - Sakshi

సాక్షి, బళ్లారి: నగరంలో డీఏఆర్‌ పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జాఫర్‌ సాబ్‌ (37) హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి పొద్దుపోయాక నగరంలోని పోలీసు వసతి గృహంలో తన రెండో భార్యతో నివాసం ఉన్న జాఫర్‌ సాబ్‌కు చెవి నుంచి రక్తస్రావం కావడంతో విమ్స్‌లో చేర్పించారు. అయితే చికిత్స ఫలించక ఆస్పత్రిలో మృతి చెందాడు. ఇది హత్యేనని పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్‌పీ రంజిత్‌ కుమార్‌ బండారితో పాటు డీఎస్పీ, గాంధీనగర్‌ ఎస్‌ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

నర్సు హనుమక్కతో రెండో పెళ్లి
పోలీసులు తెలిపిన వివరాల మేరకు జాఫర్‌ సాబ్‌ను రెండో భార్య హనుమక్కే ఇనుపరాడ్‌తో తలపై బాదడంతో మృతి చెందాడు. జాఫర్‌ సాబ్‌ మొదటి భార్య నబీనాను వదిలిపెట్టి గత 8 ఏళ్ల నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న హనుమక్క అనే నర్సును రెండో భార్యగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఇటీవల కొన్ని నెలలుగా మొదటి భార్య నబీనా దగ్గరికి కూడా జాఫర్‌ సాబ్‌ వెళుతూ వస్తూ ఉండడంతో హనుమక్క గొడవ చేసేది. బుధవారం రాత్రి కూడా రగడ పడగా జాఫర్‌సాబ్‌ భార్యపై చేయి చేసుకున్నాడు.

హనుమక్క ఆవేశం పట్టలేక ఇనుపరాడ్‌తో భర్త తలపై బాదడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో జాఫర్‌సాబ్‌ను ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ మరణించాడు. జాఫర్‌సాబ్‌ సోదరి జరీనా ఫిర్యాదు మేరకు గాంధీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని హనుమక్కను అరెస్టు చేశారు. జాఫర్‌ 2008వ బ్యాచ్‌కు చెందిన వారు. ఆయన సొంత ఊరు కంప్లి తాలూకా మెట్రి సమీపంలోని చిన్నాపురం. మొదటి భార్య నబీనాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top