కరీంనగర్‌క్రైం: నగరంలోని పీఎంజే జువెల్లరీస్‌లో దోపిడీకి పాల్పడిన కేసులో సూత్రధారి అయిన సుభోద్‌సింగ్ కస్టడీకి పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. బిహార్ రాష్ట్రంలోని పూర్ణియా జైలు నుంచి పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసుతో పాటు ఇతర కేసుల్లోనూ నిందితుడిగా ఉన్న సుభో ద్‌సింగ్ కస్టడీ కోసం ఆరు కోర్టుల్లో పీటీ వారెంట్లకు అనుమతులు పొందినట్లు పేర్కొన్నారు. సుభోద్‌సింగ్‌తో పాటు ప్రత్యేక పోలీసు బృందం గురువారం రాత్రి కరీంనగర్‌కు చేరుకుందని, అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించామన్నారు. కేసును మరింత లో తుగా విచారించేందుకు నిందితుడిని వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కస్టడీ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడినట్లు తెలిసింది.


