అవినీతిపై జగిత్యాలలో పరస్పర పోస్టర్లు
ఉప్పు, నిప్పులా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
‘కేంద్రీయ’ భూ కేటాయింపులతో మొదలైన విభేదాలు
తహసీల్ చౌరస్తాకు రావాలని సవాళ్లు
పొలిటికల్
తారాస్థాయికి ఎంపీ– ఎమ్మెల్యే వైరం
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
జగిత్యాలలో ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. దీనికి కొనసాగింపుగా.. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్, బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే భోగ శ్రావణి వర్గం కూడా ఎమ్మెల్యేతో రాజకీయంగా తాడోపేడో తేల్చుకుంటామంటూ మాటల కత్తులు నూరుతున్నారు. ఇంతవరకూ మాటలకు, మైకులకే పరిమితమైన వీరి సవాళ్లు– ప్రతి సవాళ్లు పోస్టర్ల రూపంలో గోడల మీదకు ఎక్కాయి. బీజేపీ– కాంగ్రెస్ పార్టీలు ‘మీరు అవినీతి పరులంటే మీరే అవినీతి పరులు’ అంటూ పరస్పరం నిందించుకోవడం తీవ్రరూపం దాల్చింది. కేంద్రీయ విద్యాలయం భూకేటాయింపు విషయంలో మొదలైన విమర్శల పర్వం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.


