సాక్షిప్రతినిధి,కరీంనగర్:
జిల్లా కేంద్రం పరిధిలోని మానేరు డ్యాం గేట్ల కింది భాగంలో మూడు కిలోమీటర్ల పొడవున ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్‌ఎఫ్) అభివృద్ధి పనులపై రాష్ట్ర ఇంజినీరింగ్ విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నిర్మాణాల నాణ్యత, సాంకేతిక ప్రమాణాలు, పనుల అమలు వంటి అంశాలపై దృష్టి సారించారు. సాంకేతిక అంశాలను పక్కనబెట్టి చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం, గతంలో భారీ వర్షాలతో కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ పరిస్థితులను పరిశీలించారు. కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ వద్ద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు, పనుల రూపకల్పన, అమలు విధానం, నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు.
శాంపిల్స్ సేకరణ
తనిఖీల్లో భాగంగా అధికారులు కాంక్రీట్, మట్టి, నిర్మాణ సామగ్రికి సంబంధించిన శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమి త్తం ప్రయోగశాలకు పంపించినట్లు తెలిసింది. ల్యాబ్ నివేదికలు వచ్చిన అనంతరం పనుల నాణ్యతపై పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. నిర్మాణాల్లో నాణ్యత లోపాలు లేదా సాంకేతిక ప్రమాణాల ఉల్లంఘనలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఐకానిక్‌గా ఎంఆర్‌ఎఫ్...
కరీంనగర్‌కు ఐకానిక్‌గా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రూ.615 కోట్ల వ్యయంతో ఎంఆర్‌ఎఫ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పనులు ప్రారంభించింది. కరీంనగర్ నగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో పనుల నాణ్యతపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఇటీవల చెక్ డ్యామ్ వరదనీటికి కొట్టుకుపోవడం, కొన్ని నిర్మాణాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధికారులు సమగ్ర నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.


