పీఎంజే దోపిడీ తరువాత ఖాకీల అప్రమత్తం
నిరంతర నాకాబందీలు.. అనుమానితులపై ఆరా
లాడ్జీలు, బంగారం దుకాణాల్లో సోదాలు
పర్యవేక్షిస్తున్న సీపీ గౌస్ ఆలం
కరీంనగర్‌క్రైం: నగరంపై పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల జరిగిన పీఎంజే బంగారు దుకాణం చోరీ తరువాత మరింత అప్రమత్తం అయ్యారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. నిరంతర నాకాబందీలు నిర్వహిస్తూ అనుమానితుల గురించి ఆరా తీస్తున్నారు. కరీంనగర్‌లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా సీపీ గౌస్ ఆలం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల జరిగిన దోపిడీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే బంగారు దుకాణాలు, లాడ్జీలు, హోటళ్ల నిర్వాహకులతో సమావేశమై సలహాలు సూచనలు ఇచ్చారు. నేరుగా వ్యాపార సముదాయాలను తనిఖీ చేస్తూ వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఎమర్జెన్సీ సదుపాయాలపై నిర్వాహకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతీ సముదాయంలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, విజువల్స్ స్పష్టంగా ఉండటంతో పాటు బ్యాకప్ నిల్వ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యం వహించే వ్యాపార సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
బంగారు దుకాణాలపై..
జిల్లావ్యాప్తంగా 50కి పైగా జువెల్లరీ షోరూంలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పీఎంజే జువెల్లరీ దొంగతనం నేపథ్యంలో అన్ని జువెల్లరీస్ నిర్వాహకులను పోలీసులు అప్రమత్తం చేశారు. దుకాణాల్లో తప్పనిసరిగా అర్హత కలిగిన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. దుకాణం ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, వినియోగదారుల తనిఖీలకి హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు షోరూంల్లో ఎమర్జెన్సీ అలారం ఏర్పాటు చేసి, నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు
జిల్లావ్యాప్తంగా 100 వరకు, కరీంనగర్ సిటీలో 50కి పైగా హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. పీఎంజే దొంగలు లాడ్జీల్లో ఉంటూ రెక్కీ నిర్వహించిన నేపథ్యంలో ఇకపై ప్రతీ హోటల్, లాడ్జీపై పోలీసు నిఘా తప్పనిసరిగా ఉంటుందని సీపీ నిర్వాహకులను హెచ్చరించారు. ఇటీవల నగరంలోని హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులతో సమావేశమై బసచేసే వారి వివరాల సేకరణలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. గదులు అద్దెకు ఇచ్చే ముందు ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని, ఫోన్ నంబర్లు ధృవీకరించాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. సీపీ స్వయంగా లాడ్జీలు తనిఖీ చేస్తూ రిజిష్టర్లు పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించనివారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
పెరిగిన గస్తీ.. నాకాబందీ
నగరంలో పోలీసులు గస్తీ పెంచారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. అర్ధరాత్రి సైతం వాహన తనిఖీలు చేపడుతూ అనుమానితుల గురించి ఆరా తీస్తున్నారు. ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో ఏకకాలంలో నాకాబందీ నిర్వహిస్తూ వాహన ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించనివారికి జరిమానాలు విధిస్తున్నారు. నేరాల్లో పాల్పడేవారు ఎక్కువ శాతం దొంగిలించిన, నంబర్ ప్లేట్ లేని వాహనాలు వాడుతున్న నేపథ్యంలో అలాంటి వాహనాలను స్టేషన్‌కు తరలించి, విచారణ చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై కొరడా ఝులిపిస్తున్నారు. కార్గో సెంటర్లు, ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, పాన్‌షాపుల్లో, బస్టాండ్‌లో జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన నాఖాబందీలో 1,479 వాహనాలు తనిఖీ చేశారు. 48 డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదు చేశారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేని 60 వాహనాలను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 115మందికి చలానా విధించారు.


