కరీంనగర్ అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపుపై అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో కే.మహేశ్వర్, పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే 115 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయ్యిందని, మిగతా కేంద్రాలోనూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోళ్ల నిర్వహణలో జిల్లా రా ష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, సివిల్ సప్లై డీఎం రజనీకాంత్, జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యం కొంటాం
కరీంనగర్ అర్బన్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ చిత్రామిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు స్వీకరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సుమారు 600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. కరీంనగర్ పాక్స్‌లో 600 క్వింటాళ్లు, గంగాధర పాక్స్‌లో 1200 క్వింటాళ్లు, లక్ష్మీదేవిపల్లిలో 400 క్వింటాళ్లు, చెర్లపల్లి(ఎన్)లో 400 క్వింటాళ్లు, ర్యాలపల్లిలో 320 క్వింటాళ్లు, కొండయ్యపల్లిలో 200 క్వింటాళ్లు, వెంకటాయిపల్లిలో 160 క్వింటాళ్లు, మంగపేటలో 120 క్వింటాళ్లు, మధురానగర్‌లో 40 క్వింటాళ్లు, నర్సింహులపల్లిలో 240 క్వింటాళ్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. చొప్పదండి పాక్స్‌లో 800 క్వింటాళ్లు, రామడుగు మండలంలోని తిర్మలాపూర్‌లో 1230 క్వింటాళ్లు, గన్నేరువరం మండలంలో 290 క్వింటాళ్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 2.67లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రూ.488.52 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు.
కలెక్టరేట్ ఏవోగా నరేందర్
కరీంనగర్ అర్బన్: సాధారణ బదిలీల్లో భాగంగా పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ చిత్రామిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ ఈ.నరేందర్‌ను కలెక్టరేట్ ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా నియమించారు. కలెక్టరేట్ ఏవోగా ఉన్న గడ్డం సుధాకర్‌ను జమ్మికుంట తహసీల్దార్‌గా బదిలీ చేశారు. సీ సూపరింటెండెంట్ ఎన్.రాజేశ్‌ను కరీంనగర్ అర్బన్ తహసీల్దార్‌గా, హెచ్ సూపరింటెండెంట్ టి.మాధవిని సీ సూపరింటెండెంట్‌గా నియమించారు. డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న గందె లక్ష్మినర్సింహరావు కరీంనగర్ రూరల్‌కు కేటాయించారు. గంగాధర, గన్నేరు వరం తహసీల్దార్లు ఎ.రజిత, కోడం కనకయ్య లను అదేస్థానంలో నియమించారు. కరీంనగర్ ఆర్డీవో కార్యాలయ డీఏవో వి.రఘుపతిని అక్కడే రిటైయిన్ చేశారు. నేడో, రేపో మరిన్ని బదిలీలు ఉంటాయని సమాచారం.


