జనగణన.. బడిబాట | - | Sakshi
Sakshi News home page

జనగణన.. బడిబాట

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

● గందరగోళంలో ప్రభుత్వ టీచర్లు ● బడిబాట లక్ష్యంపై అనుమానాలు ● తూతూ మంత్రంగా కార్యక్రమాలు ● తలలు పట్టుకుంటున్న హెచ్‌ఎంలు

జనగణనలో ఉపాధ్యాయులు

బాడిబాటలో ఉపాధ్యాయులు

జనగణనలో ఉపాధ్యాయులు

కరీంనగర్‌టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో ఓ వైపు బాడిబాట కార్యక్రమం.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జనగణన త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యం మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులను అయోమయానికి గురి చేస్తోంది. బడిబాట, జనగణన, టీచర్‌ ట్రెనింగ్‌ షెడ్యూల్‌ నెలరోజుల్లోనే ఉండడంతో ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 14 నుంచి జూన్‌ 19 వరకు ‘బడిబాట’ నిర్వహించేలా విద్యాశాఖ ప్రణాళికలను రూపొందించింది. 95 శాతం మంది ఉపాధ్యాయులు జనగణన విధుల్లో నిమగ్నమై ఉండడంతో పాటు ఎండల తీవ్రతతో ‘బడిబాట’ తూతూమంత్రంగానే కొనసాగుతోంది.

బడిబాట షెడ్యూల్‌ ఇదీ..

విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 651 ప్రభుత్వపాఠశాల్లో 5వేల మందికి తగ్గకుండా విద్యార్థులను చేర్పించాలనే లక్ష్యంతో ఈ నెల 14 నుంచి బడిబాట ప్రారంభమైంది. జూన్‌ 19 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగగా.. ఈనెల 28న యువత, స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. జూన్‌ 3న గ్రామసభ, 4న అవగాహన ర్యాలీ, 5న ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించాలి. 6న బడి బయట పిల్లలను గుర్తించాలి. 8 నుంచి 10 వరకు ఇంటింటి ప్రచారం, 12న వెల్కమ్‌డే (అమ్మ మాట పాఠశాల), 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్‌ఎల్‌ఎన్‌డే, 17న గర్ల్‌ చైల్డ్‌, ఇనూసీవ్‌ ఎడ్యుకేషన్‌ డే, 18న డిజిటల్‌ అవేర్నెస్‌ డే, 19న స్పోర్ట్స్‌డేతో బడిబాట ముగియనుంది.

జిల్లాలోని ఉపాధ్యాయులు జూన్‌ 9వ తేదీ వరకు జనగణన విధులు నిర్వహించనున్నారు. ఈ సమయంలోనూ బడిబాట ఏర్పాటు చేయడంతో అయోమయం నెలకొంది. 95శాతం మంది జనగణన విధుల్లో పాల్గొంటుండగా, మిగిలిన 5శాతం మందిని అదనంగా అదే విధులకు కేటాయించారు. ఇటు జనగణన, అటు బడిబాటలో ఏకకాలంలో ఎలా పాల్గొనాలో అర్థంకాక ఉపాధ్యాయులు తల పట్టుకుంటున్నారు. ఒకే సమయంలో రెండు విధులు నిర్వహించమంటే ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి ఆక్షేపణలు ఎదురవుతాయోనని హెడ్మాస్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement