డేంజర్‌ హోర్డింగ్స్‌! | - | Sakshi
Sakshi News home page

డేంజర్‌ హోర్డింగ్స్‌!

May 28 2026 1:52 AM | Updated on May 28 2026 1:52 AM

హోర్డింగ్‌లు.. బోర్డులు.. ఫ్లెక్సీలతో ముప్పు వర్షాల నేపథ్యంలో నగరానికి పొంచి ఉన్న ప్రమాదం ఒక్క ఈదురుగాలికే కూలిన హోర్డింగ్స్‌ బల్దియా మేల్కొనకపోతే పరిస్థితి తీవ్రం

కరీంనగర్‌ కార్పొరేషన్‌:

హోర్డింగ్‌లు.. బోర్డులు.. ఫ్లెక్సీల రూపంలో నగరంలో ప్రమాద ఘంటికలు మొగుతున్నాయి. వేసవి ముగింపు దశలో వచ్చే ఈదురుగాలులు, వర్షాలతో సిటీ ప్రజలకు భారీ ప్రమాదం పొంచి ఉంది. ముందస్తు హెచ్చరికగా ఒక్క గాలివానకే హోర్డింగ్‌లు.. సైన్‌బోర్డులు కూలిపోగా, అధికారులు మేల్కొనకపోతే రానున్న రోజులు నగరవాసులను కలవరపెట్టడం ఖాయం.

ఇష్టారీతిన హోర్డింగ్స్‌...

నగరం శరవేగంగా విస్తరిస్తోంది. సమీప పంచాయతీలు విలీనం కావడంతో విస్తీర్ణం పెరిగింది. వ్యాపార, వాణిజ్య పరంగా పురోగతి సాధిస్తోంది. ఇక్కడ విద్య, వైద్యం, వస్త్ర వ్యాపార రంగాలు అధికం. దీంతో సహజంగానే హోర్డింగ్స్‌, బోర్డులకు నగరంలో అధిక డిమాండ్‌ ఏర్పడింది. వ్యాపార ప్రకటనల కోసం హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేసేందుకు స్థానికులతో పాటు, బహుళ సంస్థలు పోటీపడుతున్నాయి. హోర్డింగ్స్‌ ఏర్పాటులో కనీస నిబంధనలు పాటించడం లేదు. పాత భవనాలపైన, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేస్తుండడం ఇప్పుడు సమస్యగా మారింది.

పట్టని నిబంధనలు

నగరపాలకసంస్థకు ఆదాయం పెంచే హోర్డింగ్స్‌ ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నా, నిబంధనలు పాటించకపోవడం సమస్యగా మారింది. నగరంలో భారీ హోర్డింగ్స్‌ చాలా ఉన్నా కొన్ని మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. తెలంగాణచౌక్‌, టవర్‌సర్కిల్‌, బస్‌స్టేషన్‌ తదితర వాణిజ్యప్రాంతా ల్లో పాత భవనాలపైనా భారీ హోర్డింగ్స్‌ ఏర్పాటు చేశారు. వర్షాకాలం ఈదురుగాలులు, భారీ వర్షాలకు ఆ భవనాలు తట్టుకోలేక హోర్డింగ్స్‌ కూలి పోయే అవకాశం ఉంది. కొన్ని హోర్డింగ్స్‌ మొదటి అంతస్తులో ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. గీతాభవన్‌ చౌరస్తాలోని పాత భవంతిపై ఉన్న హోర్డింగ్‌ ఒక్క గాలివానకే కూలిపోవడం తెలిసిందే. పార్క్‌లు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల్లో ఏర్పాటు చేయొద్దని నిబంధనలు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.

అంటీ ముట్టనట్లుగా పట్టణ ప్రణాళిక

హోర్డింగ్స్‌, యూనిపోల్స్‌, కాంటిలివర్స్‌ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, పర్యవేక్షించాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు పట్టకుండా వ్యవహరిస్తున్నారు. సామర్థ్యం లేని పాత భవనాలు, పార్క్‌లు, పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. విమర్శలు పెరిగినప్పుడు కాలనీల్లో ఏర్పాటు చేసిన పోల్స్‌,హోర్డింగ్స్‌ తొలగించి చేతులు దులుపుకొంటున్నారు. ఇందులోనూ పెద్ద సంస్థల హోర్డింగ్స్‌ జోలికి వెళ్లరనే విమర్శలున్నాయి. వీటన్నింటికీ రూ.లక్షలు చేతులు మారడమే కారణమనే ఆరోపణలున్నాయి.

ఫ్లెక్సీలతో ప్రమాదం

వ్యాపార, ప్రచార, రాజకీయ ప్రకటనలకు ఉపయోగించే ఫ్లెక్సీలు నగరవాసుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. రహదారులతో పాటు, అంతర్గత రోడ్లు, చివరకు వీధుల్లోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గాలివానకు ఫ్లెక్సీలు చిరిగిపోయి రోడ్లపై వెళ్తున్న వాహనాలపై, సమీప నివాసితులపై పడడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భారీ హోర్డింగ్స్‌కు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ఒక్క గాలివానకు చీలికలు, పేలికలుగా మారి కొట్టుకుపోవడం, సమీప రోడ్లు, ఇండ్లపై పడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఎప్పటికప్పుడు తొలగించాల్సిన బల్దియా సిబ్బంది, కొన్ని మాత్రమే తొలగించడం, మరికొన్నింటిని రోజుల తరబడి వదిలివేస్తుండడం వివాదాస్పదంగా మారుతోంది.

ముందస్తు హెచ్చరిక

మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు గీతాభవన్‌ పక్క భవనంపై ఉన్న హోర్డింగ్‌ కూలిపోయింది. సిమెంట్‌ దిమ్మెలతో సహా లేచిపోయింది. సమీపంలో ఉన్న ఓ వైన్‌షాప్‌ భారీ నేమ్‌ బోర్డు పడిపోయింది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో నగరవాసులు ఏ మేరకు ప్రమాదంలో ఉన్నారో చెప్పేందుకు ప్రకృతి చేసిన హెచ్చరికగా పలువురు అభివర్ణిస్తున్నారు. నగరపాలకసంస్థ అధికారులు మేల్కొని చర్యలు చేపడితేనే, నగరవాసులు వర్షాకాల ప్రమాదాలను తప్పించుకోగలుగుతారు.

ముకరంపురలో విద్యుత్‌వైర్లను ఆనుకుని ఉన్న హోర్డింగ్‌

ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద పాతభవనంపై హోర్డింగ్‌

ఆర్టీసీ బస్టాండు వద్ద చిరిగిన ఫ్లెక్సీలతో హోర్డింగ్‌

గీతభవన్‌ పక్కన కూలిన హోర్డింగ్‌

బస్టాండు సమీపంలో...

నగరంలో హోర్డింగ్స్‌ వివరాలు

హోర్డింగ్స్‌ 239

కాంటిలివర్స్‌ 133

యూనిపోల్స్‌ 04

అనుమతి లేక గతంలో తొలగింపు 230

Advertisement
 
Advertisement
Advertisement