తెలంగాణ చౌరస్తా
నగరంలోని బస్టాండు చౌరస్తా
కోర్టు చౌరస్తా
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
నగరంలోని అత్యంత రద్దీ కూడళ్లలో మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు(ఎఫ్‌వోబీ) నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగరాన్ని ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భారీస్థాయిలో నిధులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు పాదచారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టారు. నగరంలోని మూడు రద్దీ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని బల్దియా అధికారులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
అత్యధిక రద్దీ ప్రాంతాల్లో
కోర్టు, బస్టాండ్, తెలంగాణ చౌరస్తాలు నగరంలో రద్దీ కూడళ్లుగా మారాయి. రోజుకు వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ కూడళ్లు దాటుతున్నారు. పెరుగుతున్న వాహన రద్దీతో రోడ్లు దాటడం పాదాచారులకు ప్రమాదకరంగా మారుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ రద్దీ సమయాల్లో వాహనాల వేగం తగ్గకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, ప్రాథమిక సర్వే చేపట్టాలని మంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
స్మార్ట్‌సిటీలో ప్రతిపాదించినా
కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదా వచ్చినప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. నిధుల కొరత, స్థల సమస్యలు, సాంకేతిక అడ్డంకులతో ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఈసారి కేంద్ర మంత్రి ప్రత్యేక ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు అమలవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నగరాభివృద్ధికి కేంద్రం నుంచి అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రూ.840 కోట్లు మంజూరు కాగా డ్రైనేజీ, రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, వీధి దీపాలు, పార్కులు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై కసరత్తు ప్రారంభమైంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో నగర రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా భావిస్తున్నారు.
ఆ మూడు ప్రాంతాలే కీలకం
తెలంగాణ చౌరస్తా, కోర్టు చౌరస్తాలు రోజంతా ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోతుంటాయి. బస్టాండ్ చౌరస్తా అయితే జిల్లా నలుమూలల నుంచి వచ్చే బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో పాదాచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా ట్రాఫిక్ సమస్య తప్పనుంది. అధికారులు ప్రతి పాదిస్తున్న నమూనాల్లో ఆధునిక డిజైన్‌తో పాటు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తే విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు భద్రంగా రోడ్లు దాటేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు.
నగర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వందల కోట్ల నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. మెట్రో సిటీలకు ధీటుగా సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులు కేంద్రం నుంచి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నా.
– బండి సంజయ్‌కుమార్,
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
నగరాభివృద్ధే లక్ష్యం


