సమన్వయంతో అభివృద్ధి చేస్తాం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో అభివృద్ధి చేస్తాం

May 28 2026 1:52 AM | Updated on May 28 2026 1:52 AM

● త్వరలోనే కరీంనగర్‌, జగిత్యాల హైవే విస్తరణ పనులు ● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ● ఎమ్మెల్యే సత్యంతో కలిసి రూ.50కోట్ల రోడ్డు పనులు ప్రారంభం

చొప్పదండి: కలిసి సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చొప్పదండి నియోజకవర్గంలో చూస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని ఆర్నకొండ నుంచి మల్యాల ఎక్స్‌ రోడ్డు వరకు రూ.50 కోట్ల సీఆర్‌ఎఫ్‌ నిధులతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ త్వరలోనే కరీంనగర్‌–జగిత్యాల హైవే పనులు చేపడతామని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గానికి రూ.20 వేల కోట్ల నిధులను తీసుకువచ్చామని, రూ.7 వేల కోట్లు రహదారులకే ఖర్చు చేస్తున్నామని, అందులో రూ.2,500 కోట్లు వరంగల్‌, జగిత్యాల రహదారికి వెచ్చిస్తున్నామని తెలిపారు. గన్నేరువరం నుంచి కరీంనగర్‌ రావడానికి రూ.79 కోట్లతో మానేరు డ్యాంపై వంతెన నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంతో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వెళ్లడానికి భక్తులకు సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వడ్లూరి సరిత, కోమటిరెడ్డి పద్మాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత

కరీంనగర్‌రూరల్‌: గ్రామాలను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం కరీంనగర్‌ మండలం ఇరుకుల్లలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రూ.20లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు ప్రారంభించారు. బీరప్పగుడి అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బుర్ర రమేశ్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ కాశిపాక రాకేశ్‌, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ వై.సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement