కొత్తపల్లి: బలమైన గాలుల ధాటికి హోర్డింగ్‌లు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడుతుండటంతో విద్యుత్ లైన్లు తెగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్ గాలులకు ఊగిపడి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్‌సర్క్యూట్లు సంభవించడంతో పాటు విద్యుత్ తీగలు తెగుతున్నాయి. విద్యుత్ సిబ్బంది రాత్రింబవళ్లు మరమ్మతు పనులు చేపడుతున్నప్పటికీ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కరీంనగర్‌లోని ప్రధాన రహదారుల వెంబడి హోర్డింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో గాలిదుమారానికి హోర్డింగ్‌లు విద్యుత్ తీగలపై ఒరుగుతున్నాయి. విద్యుత్ తీగలపై పడ్డ ఫ్లెక్సీలను తొలగించడం విద్యుత్ సిబ్బందికి కష్టంగా మారుతోంది.


