కోల్‌సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో కుక్కల దాడులకు అడ్డుకట్ట పడడం లేదు. బుధవారం గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని బోళ్ల బజార్‌లో బాలిక(8)పై కుక్కలు దాడి చేసి కరిచాయి. శునకాలు మీదపడి దాడిచేసి గాయపరుస్తుంటే, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖా – మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల కాంగ్రెస్ కార్పొరేటర్ కుమారుడుపై కుక్కలు దాడి చేసిన ఘటన జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు.
వడదెబ్బతో కూలి మృతి
వేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లికి చెందిన పాటి తిరుపతి(59) బుధవారం వడదెబ్బతో మృతిచెందినట్లు ఎస్‌ఐ వెంకట్రాజం తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా, ఇతర పనులు చేసుకుంటున్న తిరుపతి బుధవారం గ్రామంలో ఓ మహిళ మృతిచెందగా ట్రాక్టర్‌లో కట్టెలు తీసుకెళ్లి అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నాడు. అనంతరం ట్రాక్టర్‌లో ధాన్యాన్ని కేంద్రానికి తీసుకెళ్లి ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే తల తిప్పుతుందని కుటుంబసభ్యులకు చెప్పగానే వెంటనే ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒక కొడుకు ఉన్నాడు.


