గంభీరావుపేట(సిరిసిల్ల): అవసరాలే మనిషిని అన్వేషణ వైపు మళ్లిస్తాయి అంటారు. ఈ రైతును చూస్తే నిజమే అనిపిస్తుంది. అసలే ఎండాకాలం.. విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో పిల్లలు ఈత కోసం వాగులు, వంకలకు పోవడం ఇష్టం లేక ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్‌పూల్‌గా మార్చేశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన రైతు తిరుపతిరెడ్డి తన ట్రాక్టర్ ట్రాలీని ఈతకొట్టేందుకు అనువుగా మార్చాడు. ట్రాలీలో ప్లాస్టిక్ కవర్ వేసి వ్యవసాయ పంపు ద్వారా నీళ్లు నింపాడు. ఇప్పుడు అది ట్రాలీ స్విమ్మింగ్ పూల్ అంటూ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు.


