బన్నీ వేసవి యాత్ర –18 విజ్ఞాన ప్రశ్నలు – తాతయ్య సమాధానాలు | - | Sakshi
Sakshi News home page

బన్నీ వేసవి యాత్ర –18 విజ్ఞాన ప్రశ్నలు – తాతయ్య సమాధానాలు

May 27 2026 6:08 AM | Updated on May 27 2026 6:08 AM

బన్నీ వేసవి యాత్ర –18 విజ్ఞాన ప్రశ్నలు – తాతయ్య సమాధానాలు

బన్నీ: తాతయ్యా, ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుంది?

తాతయ్య: సూర్యకాంతిలో నీలం రంగు ఎక్కువగా చెదిరిపోతుంది బాబూ. అందుకే ఆకాశం నీలంగా కనిపిస్తుంది.

రామ్‌: తాతయ్యా, వాన ఎలా వస్తుంది?

తాతయ్య: సముద్రంలో నీరు ఆవిరై మేఘమవుతుంది. ఆ మేఘాలు చల్లబడితే వానగా కురుస్తుంది.

చుక్క : తాతయ్యా, చెట్లు మనకు ఎందుకు ఉపయోగం?

తాతయ్య: చెట్లు మనకు గాలి ఇస్తాయి, నీడ ఇస్తాయి, పండ్లు ఇస్తాయి. అవి భూమికి ఊపిరితిత్తుల లాంటివి.

స్వప్న: తాతయ్యా, చంద్రుడి మీద మనిషి నడిచాడా?

తాతయ్య: నడిచాడమ్మా. 1969లో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మొదట చంద్రుడి మీద కాలు పెట్టాడు.

బన్నీ: తాతయ్యా, రాత్రిపూట నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి?

తాతయ్య: అవి చాలా దూరంలో ఉన్న సూర్యుళ్ల లాంటివి. వాటి కాంతి మన దగ్గరకు వచ్చేటప్పటికి మెరుస్తున్నట్టు అనిపిస్తుంది.

రామ్‌: తాతయ్యా, మన గుండె ఎందుకు కొట్టుకుంటుంది?

తాతయ్య: గుండె రక్తాన్ని శరీరం అంతా పంపుతుంది. అది ఆగకుండా పని చేస్తేనే మనం బతుకుతాం.

చుక్క: తాతయ్యా, విమానం గాల్లో ఎలా ఎగురుతుంది?

తాతయ్య: విమానం రెక్కల నిర్మాణం , ఇంజన్‌ స్పీడ్‌ వల్ల గాలి దాన్ని పైకి లేపుతుంది తల్లీ.

స్వప్న: తాతయ్యా, భూమి గుండ్రంగా ఉందని ఎలా తెలుసు?

తాతయ్య: ఓడ దూరంగా వెళ్తే ముందు పై భాగం కనిపించకుండా పోతుంది. అలాగే ఉపగ్రహ ఫోటోల్లో కూడా గుండ్రంగా కనిపిస్తుంది.

బన్నీ: తాతయ్యా, సబ్బుతో కడిగితే మురికి ఎలా పోతుంది?

తాతయ్య: సబ్బు నూనె, మురికిని నీటిలో కరిగేలా చేస్తుంది. అందుకే నీళ్లతో కడిగితే పోతుంది.

అందరూ: తాతయ్యా, మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు?

తాతయ్య: పుస్తకాలు చదివితే, పెద్దవాళ్ళు చెబితే, ప్రశ్నలు అడిగితే అన్నీ తెలుస్తాయి. మీరు కూడా అడగడం మానకండి!

పిల్లలకి మాట:

ప్రశ్నతో మేధో వికాసం

పెంపొందుతుంది.

ప్రశ్న, సమాధానాలతోనే సమూల మార్పులు జరుగుతాయి.

డాక్టర్‌ కోట లక్ష్మణ్‌,

ప్రభుత్వ ఉపాధ్యాయుడు

గ్రామం: కాకర్లపల్లి, మంథని,

జిల్లా: పెద్దపల్లి

Advertisement
 
Advertisement
Advertisement