చందుర్తి(వేములవాడ): బిల్లుల చెల్లింపులో ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ట్రాక్టర్ యజమాని మంగళవారం పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని లింగంపేటకు చెందిన లాండే సంతోష్ ఉపాధి పథకంలో భాగంగా 2025 ఏప్రిల్‌లో గ్రామ శివారులో చేపట్టిన పనులకు తన ట్రాక్టర్‌తో సుమారు 200 ట్రిప్పుల మట్టిని తరలించాడు. సదరు డబ్బులను ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు ఇస్తానని చెబితే ట్రాక్టర్ నడిపించానని వాపోయాడు. ఏడాదిగా బిల్లులు చెల్లించుకుండా ‘నీ ట్రాక్టర్‌తో మట్టి తరలించినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా’.. అంటూ టెక్నికల్ అసిస్టెంట్ దురుసుగా మాట్లాడారని తెలిపాడు. ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన సంతోష్ ఉదయం 11 గంటలకు పురుగుల మందు డబ్బాతో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నాడు. టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు ఎక్కడున్నడంటూ ఆవేశంతో ఊగిపోతూ ‘అతనికింత పురుగుల మందు పోసి.. నేనింతా తాగుతా’ అంటూ ఉపాధి హామీ కార్యాలయంలో అటూ ఇటూ తిరగుతుండగా, పోలీసులు అక్కడికి చేరుకుని పురుగులమందు డబ్బా తీసుకునేందుకు యత్నించారు. అధికారులందరూ రావాలంటూ, తన బిల్లు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటూ బాధితుడు పట్టుబట్టాడు. ఎంపీడీవో రాధ అక్కడికి చేరుకుని కార్యాలయానికి వస్తే మాట్లాడి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రేపు బిల్లు ఇవ్వకుంటే టెక్నికల్ అసిస్టెంట్‌కు పురుగుల మందు తాగించి, తాను తాగి చనిపోతానంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు.
చేసిన పనికి బిల్లులు చెల్లించడం లేదని..
పురుగులమందు డబ్బాతో ట్రాక్టర్ యజమాని ఆందోళన


