గోదావరి పుష్కరాలకు సమాయత్తం | - | Sakshi
Sakshi News home page

గోదావరి పుష్కరాలకు సమాయత్తం

May 27 2026 6:08 AM | Updated on May 27 2026 6:08 AM

కాళేశ్వరం: వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 6 వరకు జరగనున్న గోదావరి నది పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సమాయత్తం అవుతోందని దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని మేఘా విశ్రాంతి భవనంలో మంగళవారం ఆయన.. భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సరస్వతి ఆది, అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పించిన సౌకర్యాలను పీపీటీ ద్వారా వివరించారు. అనంతరం కమిషనర్‌ హనుమంతరావు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్ల నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎదురైన లోటుపాట్లను గుర్తించి, గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌, విద్యుత్‌ సరఫరా, వీఐపీ, వీవీఐపీల పర్యటనల ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లాల వారీగా ఇప్పటినుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల కలెక్టర్లు బొర్కడే హేమంత్‌ సహదేవరావు, కుమార్‌ దీపక్‌, సత్య ప్రసాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల అదనపు కలెక్టర్లు బుజంగరావు, వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, కాటారం ఆర్డిఓ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు

కాళేశ్వరంలో గోదావరి పుష్కరాలపై పరీవాహక ప్రాంతాల కలెక్టర్లతో సమీక్ష

Advertisement
 
Advertisement
Advertisement