దారికాచి కత్తితో దాడి! | - | Sakshi
Sakshi News home page

దారికాచి కత్తితో దాడి!

May 27 2026 6:08 AM | Updated on May 27 2026 6:08 AM

ఇల్లందకుంట: దారి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో తండ్రి దారుణ హత్యకు గురికాగా... కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో నందికొండ రాజు, చల్లూరి చంటి వరుసకు బావ, బావమర్దులు. వీరి మధ్య కొన్ని రోజులుగా ఇంటికి వెళ్లే దారి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నందికొండ రాజు కొడుకు నిశాంత్‌ను తీసుకొని ట్రాక్టర్‌ నడుపుకుంటూ పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన చల్లూరి చంటి ట్రాక్టర్‌పై వస్తున్న నందికొండ రాజు (40), అతని కొడుకు (16) నిశాంత్‌పై కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా, నిశాంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు నిశాంత్‌ను జమ్మికుంటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన జమ్మికుంట రూరల్‌ సీఐ వెంకట్‌, ఎస్సై క్రాంతికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చంటిని అదుపులోకి తీసుకున్నారు. అయితే చంటి తలపై కూడా గాయాలు ఉండడంతో ఆయనను వరంగల్‌ ఎంజీఎంకు తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తండ్రి మృతి.. కొడుక్కు తీవ్రగాయాలు

పాతర్లపల్లిలో ఉద్రిక్తత

Advertisement
 
Advertisement
Advertisement