ధర్మపురి: వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ యువకుడు ఈతకు వెళ్లి వ్యవసాయ బావిలో మునిగి చనిపోయిన ఘటన మండలంలోని కొరండ్లపల్లెలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన లింగం గౌరయ్య, లక్ష్మి దంపతుల కొడుకు అక్షయ్(22) వారం క్రితం కొరండ్లపల్లెలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఓ వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. బావిలోకి దిగిన అక్షయ్‌కు అదే సమయంలో ఫిట్స్ రావడంతో నీటిలోనే మునిగిపోయాడు. సాయంత్రం శవమై తేలాడు. అక్షయ్ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో పోలీసుల సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈత నేర్చుకునేందుకు వెళ్లి ..
చందుర్తి(వేములవాడ): ఈతకు వెళ్లిన చోటు నుంచి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన యువకుడు బావి పడి మృతిచెందిన సంఘటన చందుర్తి మండలం మల్యాలలో ఆదివారం తీరని విషాదం నింపింది. మల్యాలకు చెందిన మల్యా ల లక్ష్మి–శ్రీనివాస్ దంపతుల మూడో కొడుకు అజయ్(21) హైదరాబాద్‌లో బీటేక్ సెకండియర్ పూర్తి చేశాడు. వేసవి సెలవుల్లో ఇంటికొచ్చాడు. స్నేహితులతో కలిసి బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఇదే సమయంలో బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. గంట గడిచినా రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు చుట్టుపక్కల గాలించారు. సమీపంలోని వ్యవసాయబావి వద్ద అజయ్ ఈత నేర్చుకునేందుకు వీపునకు కట్టుకున్న క్యాన్(డబ్బా) ఒడ్డుపై పడి ఉండడంతో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి ఉంటాడని అనుమానించారు. ఈ విషయాన్ని అజయ్ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తెలపడంతో భారీ సంఖ్యలో గ్రామస్తులు చేరుకున్నారు. గత ఈతగాళ్లను పిలిపించి దాదాపు నాలుగు గంటలు గాలించడంతో మృతదేహం లభించింది. మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.


