పీఎంజే దర్యాప్తు ముమ్మరం! | - | Sakshi
Sakshi News home page

పీఎంజే దర్యాప్తు ముమ్మరం!

May 23 2026 1:28 AM | Updated on May 23 2026 1:28 AM

సుబోధ్‌సింగ్‌ కస్టడీకి పీటీ వారంట్‌

ముగిసిన ‘పీఎంజే’ నిందితుల గుర్తింపు పరేడ్‌

నిందితులను గుర్తుపట్టిన పీఎంజే, లాడ్జి సిబ్బంది

దుండగులకు ఆయుధాలు తెచ్చిన వాహనం గుర్తింపు

దోపిడీలో గాయపడ్డ నలుగురు డిశ్చార్జి

ప్రభుత్వం, ప్రతిపక్షాల నుంచి అందని సాయం

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసుల దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిందితుల గుర్తింపు పరేడ్‌ ముగిసింది. ఈనెల 3న జ్యోతినగర్‌లోని పీఎంజే జువెల్లరీస్‌లో దోపిడీ చేసిన ఐదుగురు దుండగులు అడ్డు వచ్చిన నలుగురి సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దోపిడీకి పాల్పడింది.. సుబోధ్‌ సింగ్‌ గ్యాంగ్‌గా తేల్చారు. ఈ ఘటనలో పాల్గొన్న రఘునాథ్‌ కర్మాకర్‌, రావిశ్‌ కుమార్‌, వారికి సిమ్‌కార్డులు అందించిన మెహతాబ్‌ ఖాన్‌ను బిహార్‌లో అరెస్టు చేసి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కరీంనగర్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న నిందితులను గుర్తించేందుకు పోలీసులు టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ (టీఐపీ) నిర్వహించారు. బుల్లెట్‌ గాయాలతో ప్రాణాపాయం తప్పిన నలుగురు, మే 3న విధుల్లో ఉన్న ఇతర పీఎంజే సిబ్బంది, పెద్దపల్లి లాడ్జి నిర్వాహకులను పోలీసులు పరేడ్‌ కోసం కరీంనగర్‌ జైలుకు రప్పించారు. జడ్జి సమక్షంలో జరిగిన గుర్తింపు ప్రక్రియలో దోపిడీలో పాల్గొన్న ఇద్దరు దొంగలు రఘునాథ్‌ కర్మాకర్‌, రావిశ్‌ కుమార్‌లను గుర్తుపట్టారు.

పీటీ వారంట్‌ కోసం చర్యలు..

దోపిడీకి పథకం పన్నిన గ్యాంగ్‌ లీడర్‌ సుబోధ్‌ సింగ్‌ను కరీంనగర్‌కు తీసుకువచ్చేందుకు కావాల్సిన న్యాయప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం బిహార్‌ జైలులో ఖైదీగా ఉన్న సుబోధ్‌ని ప్రిజనర్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారంట్‌ ద్వారా కరీంనగర్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. దర్యాప్తులో లభ్యమైన కీలక సమాచారం, డేటా, ఆధారాల ద్వారా అతన్ని పీటీ వారంట్‌ ద్వారా తీసుకొచ్చి విచారిస్తే.. కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

ఆయుధాలు తీసుకొచ్చిన వాహనం గుర్తింపు

దోపిడీకి దుండగులు వాడిన ఆయుధాలు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు పోలీసులకు సమాధానం దొరి కింది. సుబోధ్‌ ముఠా దోపిడీకి ముందు కరీంనగర్‌, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి పట్టణాల్లో రెక్కీ చేసింది. పీఎంజేను టార్గెట్‌గా ఎన్నుకున్న వీరికి దోపిడీకి ముందురోజు ఆయుధాలు అందాయి. మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి ఒక వాహనంలో ఆయుధాలు చేరినట్లు గుర్తించారు. సదరు వా హనం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌, నార్నూర్‌, ఇందనపల్లి చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలకు చిక్కిన ఫుటేజీని పోలీసులు సంపాదించా రు. దీని ద్వారా దర్యాప్తును వేగవంతం చేశారు.

బాధితులకు ఏదీ ఆర్థిక సాయం..?

దుండగుల కాల్పుల్లో ముస్తాక్‌, రాజేశ్‌, కమలాసన్‌, మధుకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించగలిగారు. ఇటీవల డిశ్చార్జి అయి ఇంటికి చేరిన బాధితులు కోలుకుంటున్నారు. వీరికి ఆసుపత్రి ఖర్చు మొత్తం పీఎంజే జువెల్లరీస్‌ యాజమాన్యమే భరించినట్లు సమాచారం. బాధితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడం గమనార్హం. కనీసం ఆ సమయంలో ఆర్థిక సాయం చేస్తామన్న ప్రతిపక్షాలు కూడా చిల్లిగవ్వ ఇవ్వలేదని బాధితుల సన్నిహితులు వాపోతున్నారు. తమ వారు ఆసుపత్రిలో ఉంటే మీడియాకు పోజులు ఇచ్చిన నాయకులు ఇప్పుడు కన్నెత్తి ఇటువైపు చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రావిశ్‌ కుమార్‌

రఘునాథ్‌ కర్మాకర్‌

Advertisement
 
Advertisement
Advertisement