కరీంనగర్ కార్పొరేషన్: కుక్కల బెడదను తగ్గించేందుకు ఏబీసీ సెంటర్ దోహదం చేస్తుందని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలకసంస్థ పరిధిలోని 6వ డివిజన్ బొమ్మకల్‌లో రూ.43 లక్షలతో నిర్మించిన జనన నియంత్రణ కేంద్రం (ఏబీసీ సెంటర్) భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. భవనంలో 20 ప్రీ ఆపరేటివ్ కెనల్స్, 18 పోస్టు ఆపరేటివ్ కెనల్స్, ఆపరేషన్ థియేటర్, సర్జికల్ పరికరాలు, షాడోలెస్ ల్యాంప్, ఎలక్ట్రోకాటరీ యంత్రం, సర్జికల్ కేబు ల్స్, వ్యాక్సిన్ రీఫ్రిజిరేటర్ ఉన్నాయన్నారు. అదనంగా మరో 62 కెనల్స్, ప్రహరీ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ ద్వారా ఆరేళ్లలో 5,015 కుక్కలకు జనన ని యంత్రణ ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు. కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు వెంకటేశ్, వేణు, రవీందర్ పాల్గొన్నారు.
కరీంనగర్ టౌన్: నగరంలోని కోతిరాంపూర్‌లో ఉన్న డంపింగ్ యార్డుతో ప్రజలకు ప్రాణహాని ఉందని, యార్డు తరలింపునకు శాశ్వత పరి ష్కారం చూపని పాలకులపై ఉద్యమాలు చేస్తామని సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, బీఆర్‌ఎ స్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీల నాయకులు అన్నారు. శుక్రవారం బద్ధం ఎల్లారెడ్డి భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీజేపీకి నగరంలో అధికారం అప్పగిస్తే నెల రోజుల్లో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తామని ప్రగల్బాలు పలికి, సమస్యను గాలికి వదిలేశారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజల ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోవడం లేదన్నారు. డంప్‌యార్డు పొగతో కోతిరాంపూర్, అల్కాపురికాలనీ, లక్ష్మీనగర్, కట్టరాంపూర్, హనుమాన్‌నగర్, గణేశ్‌నగర్, హౌసింగ్‌బోర్డ్ కాలనీ ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, గుడికందుల సత్యం, బీఆర్‌ఎస్ నాయకుడు జంగిలి ఐలేందర్ యాదవ్, సీపీఐఎంఎల్ నాయకులు జిందం ప్రసాద్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నగర అధ్యక్షుడు కొక్కిరాల సత్యారావు పాల్గొన్నారు.
కరీంనగర్ అర్బన్: గిరిజన కులాల ఉప ప్రణా ళికలో భాగంగా శుక్రవారం వ్యవసాయ ఉత్పాదకాలను పంపిణీ చేశారు. అఖిల భారత మొక్కజొన్న పరిశోధన కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా మొక్కజొన్న సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ, వ్యవసాయ ఉత్పాదకాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించారు. హెడ్ డీన్ డా.బి.రాంప్రసాద్ మొక్కజొన్నలో వచ్చే చీడపీడలు, యాజమాన్యం గురించి వివరించారు. శాస్త్రవేత్తలు డా.ఉమారాణి, రజినీకాంత్, ఎ.ఉషారాణి, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఅర్డినేటర్ బి.హరిక్రిష్ణ, మదన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొనగా ఎర్రబెల్లి గ్రామానికి చెందిన 52మంది గిరిజన రైతులకు సింగిల్ సీడర్ పంపిణీ చేశారు.
జమ్మికుంట: ట్రక్‌షీట్ ఇచ్చి మూడు రోజులు అవుతున్నా ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని కొత్తపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగువన భూపాలపల్లి జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ, టేకుమట్ల మండలాలకు చెందిన మొక్కజొన్న, ధాన్యం రైతులు అక్కడ కొనుగోలు కేంద్రాల నుంచి ట్రక్‌షీట్ల అనుమతితో పంటను జమ్మికుంట లోని పలు మిల్లులకు తెచ్చారు. మూడు రోజులుగా మిల్లర్లు పంటను దిగుమతి చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


