బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ సంబరాలు
రూ.840 కోట్ల పథకం తెచ్చిందే తామంటున్న బీజేపీ
రూ.630 కోట్లు ఇచ్చేదే మేమంటున్న కాంగ్రెస్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో మరో అభివృద్ధి జాతరకు బీజం పడింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ అనంతరం ఆ స్థాయిలో వచ్చిన అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) పథకం నగర స్వరూపాన్ని సమూలంగా మార్చేయనుంది. రూ.840 కోట్లతో నగరంలో అభివృద్ధి పనుల జాతర సాగనుండడంతో, ఆ క్రెడిట్‌ను సొంతం చేసుకొనేందుకు కేంద్రంలో అధి కార బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌లు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. యూసీఎఫ్‌లో కరీంనగర్ చేరడంపై వేర్వేరుగా సంబరాలు నిర్వహించాయి.
తెచ్చిందే మేము..
అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకం కింద రూ.840 కోట్ల భారీ నిధులు నగరానికి రానుండడంతో బీజేపీ సంబరాలు చేపట్టింది. తెలంగాణచౌక్‌లో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రపటాలను పాలతో అభిషేకించారు. ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ పట్టుబట్టి కరీంనగర్ నగరపాలకసంస్థను యూసీఎఫ్ జాబితాలో చేర్పించారని మేయర్, డిప్యూటీ మేయర్లు వెల్లడించారు.
ఇచ్చేదే మేము...
నగర స్వరూపాన్ని మార్చే రూ.840 కోట్ల యూసీ ఎఫ్ పథకంలో రూ.630 కోట్లు భరించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతోనే యూసీఎఫ్ పథకంలో కరీంనగర్ చేరిందంటున్నారు. నగరపాలకసంస్థ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, చాడగొండ బుచ్చిరెడ్డి, పడిశెట్టి భూమయ్య, పడాల అజయ్, ఆకుల ఉదయ్, మడుపు మోహన్, మహమ్మద్ అమీర్, అబ్దుల్‌రెహమాన్ క్షీరాభిషేకం చేశారు. రూ.840 కోట్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం రూ.210 కోట్లు అని, మిగిలిన రూ.630 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు. రాష్ట్రవాటా 25 శాతం రూ.210 కోట్లతో పాటు, హడ్కో రుణం రూ.420 కోట్లు భరించేది రాష్ట్ర ప్రభుత్వమేనని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత అంటున్నారు.
సరైన మార్గంలో వెచ్చిస్తేనే...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.840 కోట్ల నిధులు నగరాభివృద్ధికి వెచ్చించనుండడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా నిధులను ‘సరైన మార్గం’లో వెచ్చి స్తే మోడల్ సిటీగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా యూసీఎఫ్ పథకం మంజూరు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అమలులో మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. మార్గదర్శకాల ఆధారంగా రూ.840 కోట్ల పనులకు సంబంధించిన డీపీఆర్ రూపొందించే పనిని ప్రైవేట్ ఏజెన్సీకి నగరపాలకసంస్థ అప్పగించనుంది. ఆ తరువాత యూసీఎఫ్ స్కీంపై మరింత స్పష్టత రానుంది.
సీఎం రేవంత్, మంత్రి పొన్నం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న అంజన్‌కుమార్, నాయకులు
ప్రధాని మోదీ, మంత్రి సంజయ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న మేయర్ శ్రీనివాస్, నాయకులు


