ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్: 9154249727
కరీంనగర్ అర్బన్: ధా న్యం కొనుగోలులో తరు గు పేరిట మిల్లర్లు, కేంద్రాల్లో కోత పెడితే కఠి నంగా వ్యవహరిస్తామని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ మంగళారపు రజనీకాంత్ స్పష్టం చేశా రు. జిల్లాలో 317 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతుండగా, ఐకేపీ 91, ప్యాక్స్ 178, డీసీఎంఎస్ 39, హాకా 09 కేంద్రాలను నిర్వహిస్తోందని వెల్లడించారు. రైతులను ఇబ్బంది పెడితే టోల్ ఫ్రీ నంబర్ 9154249727కు ఫిర్యాదు చేయాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రాల్లో సౌకర్యాలు, మద్దతు ధర, దళారుల దోపిడీకి అడ్డుకట్ట వంటి అంశాలపై శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
జిల్లా అంతటా కొనుగోళ్లు
ఈ సీజన్లో వరి కోతలు కొంత ఆలస్యమయ్యాయి. 5.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1.90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం.
పక్కా కార్యాచరణతో..
కొనుగోలు కేంద్రంలో తాగునీరు, టెంట్, కూలీల కోసం షెడ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించాం. అవసరానికి సరిపడా గన్నీ సంచులు ఉన్నాయి. రోజూ లక్ష నుంచి రెండు లక్షల వరకు సంచుల్లో ధాన్యం నింపుతున్నారు. టార్పారిన్లు, ధాన్యం రవాణాకు లారీలు అందుబాటులో ఉన్నాయి. కేంద్రాల నుంచి తీసుకెళ్లిన ధాన్యాన్ని 24 గంటల్లో దించాలని మిల్లర్లకు సూచించాం.
నిబంధనల ప్రకారమే తూకం
ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం తూకం వేయాలని నిర్వాహకులకు, మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాం. తాలు లేకుండా శుభ్రమైన ధాన్యం తీసుకువచ్చి రైతులు సహకరించాలి. తేమ 17 శాతం మించరాదు. గన్నీ సంచిలో 40.580 కిలోలు తూకం వేయాలి. తరుగు పేరుతో అదనంగా తూకం వేయరాదు.
ఎప్పటికప్పుడు నగదు జమ
రైతులకు నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు చేపడుతున్నాం. ట్యాబ్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్రాల్లో సిబ్బందిని నియమించాం. వానాకాలం సీజన్లో 72 గంటల్లో ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సారి వీలైనంత త్వరగా నగదు చేరుతోంది. ఇప్పటివరకు రూ.250 కోట్లు రైతుల ఖాతాకు చేరింది. ధాన్యం వెంటవెంటనే దింపుకోవాలని మిల్లర్లను ఆదేశించాం. తరుగు పేరిట కోత విధిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. బ్యాంక్ గ్యారంటీలు అందజేసిన మిల్లులకే ధాన్యం కేటాయించాం.
జిల్లాలో సాగు విస్తీర్ణం: 2,73,397
రానున్న దిగుబడి: 5.66లక్షల మెట్రిక్ టన్నులు
కేంద్రాలకు వచ్చిన ధాన్యం: 3,20,143 మె.ట
కొనుగోలు చేసిన ధాన్యం: 1,90,350 మె.ట
మిల్లులకు తరలించిన ధాన్యం: 1,73,210
మొత్తం కొనుగోలు కేంద్రాలు: 317
ధాన్యం విక్రయించిన రైతుల సంఖ్య: 32,951


