ఇక పనుల జాతర! | - | Sakshi
Sakshi News home page

ఇక పనుల జాతర!

May 22 2026 4:22 AM | Updated on May 22 2026 4:22 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రూ. 840 కోట్ల పనులు

మోడల్‌ రోడ్లు, స్కైవాక్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, జంక్షన్ల అభివృద్ధికి రూ.630 కోట్లు

డ్రెయిన్ల పునరుద్ధరణ, వరద నీటి నివారణ చర్యలకు రూ.130 కోట్లు

ఘన వ్యర్ధాల నివారణకు రూ.80 కోట్లు

యూసీఎఫ్‌ కింద పనులకు కేంద్రం ఆమోదం

పట్టుపట్టి సాధించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌

పట్టుపట్టి సాధించుకున్న కేంద్ర మంత్రి సంజయ్‌

నిధుల వరద

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

రీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నిధుల వరద రానుంది. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) స్కీం కింద రూ.840 కోట్ల విలువైన పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకే కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి హీరాలాల్‌ మిశ్రా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఈ నిధులతో కరీంనగర్‌లో స్కైవాక్‌లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు, మోడల్‌ రోడ్లను నిర్మించనున్నారు. డ్రైయిన్లను పునరుద్ధరించనున్నారు. వరద నీటి నివారణ చర్యలు చేపట్టనున్నారు. ఈ నిధులు సద్వినియోగమైతే నగర రూపురేఖలే మారనున్నాయి. హైదరాబాద్‌ తర్వాత అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

ఏ పనులకు ఎంత?

పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్‌ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, స్కైవాక్‌లు, నాన్‌–మోటరైజ్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయాలతో పాటు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ. 630 కోట్ల పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. డ్రెయిన్ల పునరుద్ధరణ, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లు, సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.80 కోట్లకు ఆమోదం లభించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు చెందిన అపెక్స్‌ కమిటీ ఈనెల 11న ఢిల్లీలో సమావేశమై ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. కమిటీ ఆదేశాల మేరకు గత శనివారం కేంద్ర అధికారుల బృందం నగరంలో పర్యటించింది. తాజాగా ఆయా ప్రతిపాదనలకు కేంద్రం తుది ఆమోదం తెలిపింది.

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ హర్షం...

అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) స్కీంలో భాగంగా కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కు రూ.840 కోట్ల నిధుల మంజూరు కావడంపట్ల మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌ రావు, బీజేపీ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ లకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కృషి మర్చిపోలేనిదని అన్నారు.

తొలుత వరంగల్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదనలను మాత్రమే యూసీఎఫ్‌ స్కీంలో చేర్చారు. ఖమ్మం–వరంగల్‌–కరీంనగర్‌ కారిడార్‌ ను కూడా ఈ స్కీంలో చేర్చారు. ఆయా ప్రతిపాదనలకు సంబంధించి డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను కూడా కేంద్రానికి పంపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన యూసీఎఫ్‌ ప్రతిపాదనల జాబితాలో కరీంనగర్‌ లేదు. విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ను సైతం యూసీఎఫ్‌ జాబితాలో చేర్చాలని పట్టుపట్టారు. కరీంనగర్‌ అభివృద్ధి, ఆధునీకరణ కోసం ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి పంపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌లను కలిసి ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు. దీంతో తెలంగాణ నుంచి వచ్చిన మూడు ప్రతిపాదనలకు యూసీఎఫ్‌ నేషనల్‌ అపెక్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement