మక్కల పైసలు పడ్తలెవ్‌! | - | Sakshi
Sakshi News home page

మక్కల పైసలు పడ్తలెవ్‌!

May 22 2026 4:22 AM | Updated on May 22 2026 4:22 AM

1.78లక్షల క్వింటాళ్ల కొనుగోలు

రైతులకు అందాల్సింది రూ.42.92కోట్లు

విక్రయానికి పడిగాపులే.. డబ్బులకు ఇబ్బందులే

ఈ రైతు పేరు బొందల రాకేశ్‌. ఈ నెల 4న కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో 60 క్వింటాళ్ల మక్కలు విక్రయించాడు. రూ.1.44 లక్షలు రావాల్సి ఉంది. 17 రోజులైనా డబ్బులు రాకపోగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. మరోవారం రోజులైతే వానాకాలం సాగుకు సిద్ధం కావాల్సి ఉంటుందని, ఎన్ని సార్లు తిరిగితే డబ్బులొస్తాయని రాకేశ్‌ వాపోతున్నాడు. రాకేశ్‌ ఒక్కడే కాదు.. జిల్లావ్యాప్తంగా వేలమంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఇదే.

––––––––––––––––––––––––––

కరీంనగర్‌ అర్బన్‌: పంట పండించడం ఒక ఎత్తయి తే విక్రయించడం సాహసంలా మారింది. రైతులను పట్టించుకునే నాథుడే కరవవడంతో యార్డులు, కార్యాలయాల చుట్టూ తిరగడం వారి వంతవుతోంది. పంట కొనుగోలు చేసిన 48గంటల్లోనే రైతు ఖాతాకు నగదు జమ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా, ఆచరణ శూన్యంగా మారింది. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మక్కల కొనుగోళ్లు జరుగుతుండగా అదనపు విధుల పేరుతో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సౌకర్యాల కల్పన, రవాణా, ఇతర వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాగైతే ఎలా

జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు మక్కలు విక్రయించగా వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీంతో వానాకాలం సీజన్‌ పంటల సాగుకు పొలాలను సిద్ధం చేసుకునేందుకు అవసరమైన పెట్టుబడికి ఇబ్బందులు తప్పేలా లేవు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించగా దళా రులకే కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు పుష్కలం. దళారులు క్వింటాల్‌కు రూ.1700 నుంచి రూ.1800 కు కొనుగోలు చేస్తుండగా మద్దతు ధర రూ.2400. క్వింటాల్‌కు రూ.600 రైతులు నష్టపోతున్నారు.

నిబంధన కొర్రీ

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులే, ఎకరాకు 25 క్వింటాళ్ల వరకే విక్రయించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సారి గుంటకు క్వింటాల్‌ చొప్పున దిగుబడి రాగా ఎకరాన 40క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన మిగతా 15 క్వింటాళ్లు విక్రయించడమెలా అన్నది అంతుచిక్కని ప్రశ్న. కేంద్రాల నిర్వాహకులు కొన్న పంటను ఉన్నతాధికారులు సూచించిన గోదాంలకు లారీల్లో తరలించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి ఆధార్‌, బ్యాంకు ఖాతా నంబరు తదితర వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నకలు ప్రతుల రూపంలో తీసుకోగా నేటికి డబ్బులు జమకాకపోవడం ఆందోళనకర పరిణామం.

ఏడు కేంద్రాల్లో కొనుగోళ్లు

కరీంనగర్‌, చొప్పదండి, గన్నేరువరం, చిగురుమామిడి, మల్లాపూర్‌(తిమ్మాపూర్‌), సైదాపూర్‌, జమ్మికుంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ నాలుగో వారం నుంచి కేంద్రాలు ప్రారంభించగా రైతులు మక్కలు విక్రయించడం ప్రారంభించారు. 1,78,850 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేయగా 4,720 మంది రైతులు విక్రయించారు. ఈ లెక్కన రూ.42.92కోట్లు రైతుల ఖాతాలో చేరాల్సి ఉండగా ఒక్కరికీ డబ్బులు జమకాకపోవడం విడ్డూరం. కాగా మక్కల కొనుగోళ్లపై ప్రభుత్వానికి నివేదించామని, డబ్బులు రాగానే రైతుల ఖాతాకు జమవుతాయని మార్క్‌ఫెడ్‌ డీఎం వివరించారు.

జిల్లాలో కొనుగోలు కేంద్రాలు: 07

కొనుగోలు చేసిన మక్కలు:

1,78,850 క్వింటాళ్లు

విక్రయించిన రైతులు: 4,720

రైతుల ఖాతాకు రావాల్సిన నగదు: రూ.42.92కోట్లు

ఇప్పటివరకు రైతు ఖాతాకు

చేరిన నగదు: సున్నా

Advertisement
 
Advertisement
Advertisement