జమ్మికుంట యార్డులో బినామీ దందా?
మక్కలు చూపకుండా రిజిష్టర్‌లో రైతుల పేర్లు నమోదు
మార్కెట్ పాలకవర్గం, సెంటర్ ఇన్‌చార్జి మధ్య వాగ్వాదం
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్ యార్డులో బినామీ దందా సాగుతోంది. వచ్చిన పంట కన్నా, నమోదవుతున్న రైతుల సంఖ్య రెట్టింపుగా కనిపిస్తోంది. ఈ విషయమై పాలకవర్గం, సెంటర్ ఇన్‌చార్జి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. కలెక్టర్‌కు పరస్పర ఫిర్యాదులు అందాయి. జమ్మికుంట మార్కెట్ యార్డుకు వారం రోజులుగా పెద్ద ఎత్తున మొక్కజొన్న పంటను రైతులు తీసుకొస్తున్నారు. రెండు రోజుల వరకు పాలకవర్గం గన్నీ సంచులు, మక్కల తరలింపుపై దృష్టి సారించింది. గురువారం సాయంత్రం గన్నీ సంచులు పంపిణీ చేసే క్రమంలో మక్కల కుప్పలు చూపకండా రిజిష్టర్‌లో బినామీ పేర్లు నమోదు చేయడాన్ని పాలకవర్గం గుర్తించింది. 14న 126 మంది పేర్లు నమోదు కాగా 63మంది యార్డులో మక్కలు పోశారు. 15న 97మంది పేర్లు నమోదు కాగా 47 మంది మాత్రమే మక్కలు పోసినట్లు పాలకవర్గం సభ్యులు గుర్తించారు. ఈ విషయమై సెంటర్ ఇన్‌చార్జిని పాలకవర్గం సభ్యులు ప్రశ్నించగా.. ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. రైతుల అవసరాలను అసరా చేసుకుని, ట్రేడర్లతో చేతులు కలిపి గన్నీ సంచులు ఇచ్చి, మార్క్‌ఫైడ్ ద్వారా ప్రభుత్వ మద్దతు ధర పొందేందుకు లారీలు పెట్టి విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై మార్కెట్ చైర్ పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


