కరీంనగర్ క్రైం: పోక్సో కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని సీపీ గౌస్ ఆలం సిబ్బందిని ఆదేశించారు. కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 2024 వరకు పెండింగ్‌లో ఉన్న కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాల స్థితిగతులపై ఆరా తీశారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలన్నారు. ఇటీవల జరిగిన నేపాలీ ముఠాల ఘటనలను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్‌వ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న నేపాలీల వివరాలను పోలీస్‌స్టేషన్ల వారీగా నమోదు చేయాలన్నారు. బ్యాంకులు, జువెల్లరీ వ్యాపార సంస్థల్లో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి, భద్రతా ప్రమాణాలపై తగు సూచనలు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ‘నాకాబందీ’ నిర్వహించాలన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. శిక్షణ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వేణుగోపాల్, శ్రీనివాస్ జి, విజయ్‌కుమార్, వెంకటస్వామి, మాధవి, సతీశ్, ప్రతాప్, సీఐలు, ఎస్సై పాల్గొన్నారు.


