నగరంలో ‘వీధి’ కుక్కలదే రాజ్యం
చిన్నారులు, వృద్ధులు బెంబేలు
నిలిచిన స్టెరిలైజ్.. ప్రారంభానికి నోచని ఏబీసీ సెంటర్
కరుణ కాదు.. కారుణ్య మరణాలు
తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు
నెల 2023–24 2024–25 2025–26
ఏప్రిల్ 192 205 315
మే 114 207 316
జూన్ 154 232 238
జూలై 194 196 361
ఆగస్టు 158 192 252
సెప్టెంబర్ 164 175 307
అక్టోబర్ 175 221 481
నవంబర్ 210 233 1,295
డిసెంబర్ 193 221 585
జనవరి 229 250 467
ఫిబ్రవరి 165 217 475
మార్చి 265 263 473
మొత్తం 2,213 2,612 5,565
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలో ని 66 డివిజన్లలో వీధి కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చింది. వాకింగ్‌కు వెళ్లే వృద్ధులు, మహిళలు, బస్‌స్టాండ్, పార్క్‌లు, వీధుల్లో తిరిగే చిన్నారులపై ఎప్పుడు ఏ వైపు నుంచి కుక్కలు దాడి చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ముకరాంపుర, విద్యానగర్, జ్యోతినగర్, భగత్ నగర్, కాశ్మీర్ గడ్డ, హౌ సింగ్‌బోర్డుకాలనీ, మారుతినగర్, లక్ష్మినగర్, రేకుర్తి, తీగలగుట్టపల్లి, హనుమాన్‌నగర్, వికలాంగుల కాలనీ తదితర ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతూ కాలనీవాసులను హడలెత్తిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా బైక్‌లపై వెళ్లే వారి వెంటపడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
నిలిచిన స్టెరిలైజేషన్
కుక్కల సంతానోత్పత్తిని నివారించేందుకు గతంలో నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం సమీపంలోని వెటర్నరీ ఆస్పత్రిలో ఏబీసీ నిర్వహించారు. కుక్కలకు ఇక్కడే శస్త్ర చికిత్స చేసేవాళ్లు. ఏబీసీలో వసతులు లేవని, జంతుప్రేమికులు కోర్టును ఆశ్రయించడంతో కుక్కల శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆరు నెలలుగా నగరంలో కుక్కలకు స్టెరిలైజ్ చేయడం లేదు. దీనితో మరింత రెచ్చిపోతున్నాయి. నగరంలో కుక్క కాటు బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
సుప్రీం తీర్పు నేపథ్యంలో
కుక్కల సంతానోత్పత్తి నివారించి, తీవ్రత తగ్గించేందుకు స్టెరిలైజేషన్ చేపడుతుంటారు. ఏయే ప్రాంతంలో కుక్కలను తీసుకొచ్చి స్టెరిలైజ్ చేస్తారో తిరిగి అదే ప్రాంతంలో వదిలిపెడుతుంటారు. హాస్పిటల్స్, పాఠశాలలు, కళాశాలలు, బస్‌స్టేషన్‌లు, రైల్వే స్టేషన్‌ల వద్ద పట్టుకున్న కుక్కలకు స్టెరిలైజ్ చేసిన అనంతరం ఏబీసీ సెంటర్‌లోనే ఉంచాలని, వాటిని వదిలిపెట్టొద్దని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై జంతుప్రేమికులు కోర్టును ఆశ్రయించగా, కుక్కల విషయంలో కరుణ కాదు.. అవసరమైతే కారుణ్య మరణాలు చేయాలని సుప్రీం తాజాగా ఆదేశించింది. నగరంలో పిచ్చికుక్కలను గుర్తిస్తే వైద్యుల నిర్ధారణ తరువాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చంపాల్సి ఉంటుంది.
కుక్కలను నియంత్రించాలి
నగరంలో కుక్కల బెడద తీవ్రమవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటి నుంచి కాలుబయట పెడితే చాలు కుక్క లు వెంటపడుతుండడం తంతుగా మారింది. త్వరగా ఏబీసీ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించి, కుక్కల బెడదను తగ్గించాలని నగరవాసులు కోరుతున్నారు.
కరెంట్ లేక.. ప్రారంభానికి నోచుకోక
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బొమ్మకల్‌లో ఏబీసీ సెంటర్ భవన నిర్మాణాన్ని చేపట్టారు. రూ.35 లక్షల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణం పూర్తయింది. భవనంలో 38 కెనెల్స్ నిర్మించగా (కుక్కలను నిలిపే), మరో 62 కెనెల్స్ నిర్మించాలని ఇటీవల కౌన్సిల్ తీర్మానించింది. అయితే భవనానికి విద్యుత్‌కనెక్షన్ లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోవడం లేదు.


