జీవన శైలి కరువు.. మాతృత్వం బరువు | - | Sakshi
Sakshi News home page

జీవన శైలి కరువు.. మాతృత్వం బరువు

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

మహిళలల్లో పెరుగుతున్న సమస్య

జిల్లాలో విచ్చలవిడిగా వెలుస్తున్న ఐవీఎఫ్‌ సెంటర్లు

ఐవీఎఫ్‌పై ఆసక్తి చూపుతున్న పిల్లలు లేని దంపతులు

కరీంనగర్‌: ఒకప్పుడు పెళ్లయిన కొద్ది కాలానికే సహజంగా గర్భం దాల్చేవారు. ఇప్పుడు మారిన జీవనశైలి, ఉద్యోగ ఒత్తిళ్లు, ఆలస్య వివాహాలు, ఫాస్ట్‌ఫుడ్‌ అలవాట్లు, నిద్రలేమితో మాతృత్వం చాలా మందికి సవాలుగా మారుతోంది. కొద్దిరోజులు వేచిచూసి చాలా మంది ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో గతంలో హైదరాబాద్‌కే పరిమితమైన ఫెర్టిలిటీ చికిత్సలు ఇప్పుడు జిల్లాకేంద్రానికే చేరాయి. ఐవీఎఫ్‌, ఐయూఐ, టెస్ట్‌ట్యూబ్‌ బేబీ చికిత్సలకు నగరంలో ప్రత్యేక కేంద్రాలు వెలుస్తున్నాయి. ఇప్పటికే పది వరకు సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. ఐవీఎఫ్‌ నడుస్తున్నప్పటికీ సరోగసీ అనుమతులు ఎవరికీ లేదు. సరోగసీ నిబంధనలు కఠినంగా ఉండడంతో వైద్యులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది.

ఐవీఎఫ్‌పై పెరుగుతున్న ఆసక్తి

సహజ గర్భధారణ కష్టమవుతున్న కొందరు దంపతుల్లో ఐవీఎఫ్‌పై ఆసక్తి పెరుగుతోంది. పెళ్లయిన రెండు, మూడేళ్లలో సహజంగా గర్భం రాలేదంటే ఐవీఎఫ్‌ను ఎంచుకుంటున్నారు. ఐవీఎఫ్‌ చికిత్స పొందుతున్న అందరికీ సత్ఫలితాలు ఇస్తుందా అంటే అది వారి శరీర తత్వంపై ఆధారపడి ఉంటుందని, కొందరికి ఏడాదిలో సక్సెస్‌ అయితే మరికొందరికి రెండు మూడేళ్లు పడుతుందని వైద్యులు చె బుతున్నారు. కరీంనగర్‌లో మధ్యతరగతి, ఉద్యోగ దంపతుల్లో ఫెర్టిలిటీ సేవలపై డిమాండ్‌ పెరుగుతోందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఒక్క ఐవీఎఫ్‌ సైకిల్‌కే రూ.లక్షల్లో ఖర్చవుతుండటంతో ‘ మాతృత్వం’ ఇప్పుడు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఒక్కో సెంటర్‌లో ఐవీఎఫ్‌కు రూ.లక్షన్నర నుంచి రూ.రెండున్నర లక్షలు, ఐయూఐకు రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఐవీ ఎఫ్‌కు డిమాండ్‌ పెరగడంతో మోసాలూ పెరుగుతున్నాయి. తెలంగాణలో ఐవీఎఫ్‌ కేంద్రాల పర్యవేక్షణను ప్రభుత్వం కట్టుదిట్టం చేస్తోంది. ఇటీవల ఫెర్టిలిటీ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ప్రారంభమైంది.

ప్రభుత్వ ఫెర్టిలిటీ సెంటర్‌పై ఆశ

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ఉచిత ఐవీఎఫ్‌ కేంద్రాన్ని ప్రారంభించింది. జిల్లాస్థాయిలోనూ ఫెర్టిలిటీ సేవలు విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్నప్పటికీ, కరీంనగర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక ఫెర్టిలిటీ సెంటర్‌ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement