బంగారం దుకాణాల్లో పోలీసుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

బంగారం దుకాణాల్లో పోలీసుల తనిఖీలు

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

కరీంనగర్‌ క్రైం: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా బుధవారం సీపీ గౌస్‌ ఆలం ఆధ్వర్యంలో పలు బంగారు ఆభరణాల దుకాణాలు, లాడ్జీలు, బస చేసే హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బంగారం దుకాణాల్లో అర్హత గల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ ద్వారాల వద్ద డోర్‌ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌, లోపలికి వచ్చే వారిని తనిఖీ చేయడానికి హ్యాండ్‌ హెల్డ్‌ మెటల్‌ డిటెక్టర్లను ఉపయోగించాలన్నారు. పలుచోట్ల ఎమర్జెన్సీ అలారమ్స్‌ అమర్చాలని, వాటిని నొక్కిన వెంటనే పోలీసులకు సమాచారం అందేలా అనుసంధానం చేయాలన్నారు. హోటళ్లలో రూంలు అద్దెకు ఇచ్చే సమయంలో కస్టమర్ల నుంచి ఖచ్చితంగా ఆధార్‌ కార్డ్‌ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు సేకరించాలన్నారు. వారిచ్చే ఫోన్‌ నంబర్లను సరి చూసుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. భద్రతా ప్రమాణాల్లో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, వేణుగోపాల్‌, వాసాల సతీశ్‌, సీఐ రాంచందర్‌రావు పాల్గొన్నారు.

అర్హులైన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయాలి

కరీంనగర్‌: 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. విద్యానగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, రికా ర్డుల నిర్వహణ, హాజరు రిజిస్టరు, ఎన్‌సీడీ రిజిస్టర్‌, ఫార్మసీ స్టోర్‌, ఓపీ రిజిస్టర్‌, సిబ్బంది పనితీరును పరిశీలించారు. డాక్టర్లు సనా జవేరియా, నాజియా ఫాతిమా, సాహితీ పాల్గొన్నారు.

రూ.50 కోట్ల పనుల్లో కదలిక

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఇటీవల చర్చనీయాంశంగా మారిన రూ.50 కోట్ల అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (యూఐఎఫ్‌డీ) నిధులతో చేపడుతున్న పనులకు మోక్షం లభిస్తోంది. 87 పనులకు సంబంధించిన ఆన్‌లైన్‌ టెండర్‌ ప్రక్రియ ను అధికారులు చేపట్టగా, 86 పనులకు కాంట్రాక్టర్లు బిడ్‌ దాఖలు చేశారు. ఒక పనికి ఎవ రూ ముందుకురాలేదు. గత సంవత్సరం ప్రత్యేక అధికారి పాలనలో నగరపాలకసంస్థకు వచ్చిన రూ.50 కోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించడం, టెండర్‌ దశకు చేరడం తెలిసిందే. ఆ తరువాత కొత్త పాలకవర్గం ఏర్పడడంతో రూ.50 కోట్ల టెండర్‌ ప్రక్రియను నిలిపివేసి, నగరవ్యాప్తంగా పనులను విభజించి మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు పంపించారు. కౌన్సిల్‌ ప్రతిపాదనలకు సీడీఎంఏ అంగీకరించడంతో, టెండర్‌ ప్రక్రియను నిర్వహించారు. ఆన్‌లైన్‌ టెండర్‌లో బిడ్‌ దాఖ లు గడువు బుధవారంతో ముగిసింది. మొత్తం 87 పనుల్లో 86 పనులకు బిడ్స్‌ దాఖలైనట్లు సమాచారం. ఇందులో 18 పనులకు తీవ్రమైన పోటీ ఏర్పడిందని తెలిసింది. కాగా వారం రోజుల్లో మిగతా ప్రక్రియ పూర్తి చేస్తామని, ఆ తరువాత డివిజన్లలో అభివృద్ధి పనులు మొదలవుతాయని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement